బంజారాహిల్స్, నవంబర్ 11: జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని జేఎన్‌ఏఎఫ్‌ఏయూకు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 53 రోజులుగా తామంతా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోందని అంబేద్కర్ వర్సిటీ ఐక్య కార్యాచరణ సమితి చైర్ పర్సన్ ప్రొ.పల్లవీ కాబ్డే అన్నారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉద్యోగులంతా మధ్యాహ్న భోజనం సమయంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొ.పల్లవీ కాబ్డే మాట్లాడుతూ, దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థలో ఓపెన్ యూనివర్సిటీలదే కీలకపాత్ర అని తెలంగాణ మేధావులు,విద్యావేత్తలు చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఓపెన్ యూనివర్సిటీ మనుగడను దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వర్సిటీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని ఎవరికీ కేటాయించవద్దని తెలంగాణ మేధావులు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని, 53 రోజులుగా యూనివర్సిటీలో అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా కార్యాచరణ రూపొందించుకోనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ వేణుగోపాల్‌రెడ్డి. నేతలు ప్రొ.జి.పుష్పా చక్రపాణి, ఎండీ. హబీబుద్దీన్.డా. అంబేద్కర్. ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.