సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) / అబిడ్స్ : నగరంలో నుమాయిష్ ‘నయా’ జోష్‌ను నింపింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 1న మొదలైన 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన వచ్చే నెల 15వ తేదీ వరకు 45రోజుల పాటు కొనసాగనున్నది. నాలుగు రోజుల కిందట ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌కు రోజురోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.
సంక్రాంతి వరకు మరింత పెరుగనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది అంచనాలకు మించి దాదాపు 25 లక్షల పైచిలుకు సందర్శకులు రానున్నట్లు సొసైటీ ప్రతినిధి సంజీవరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఎగ్జిబిషన్‌కు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి అనుమతిస్తున్నారు. అగ్నిమాపక యంత్రాలను సైతం అందుబాటులో ఉంచారు.
1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ 1946లో ఎగ్జిబిషన్ మైదానంలోకి మారింది. అప్పటి నుంచి 26 ఎకరాల సువిశాల మైదానంలో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సందర్భకుల కోసం 2400 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫుడ్‌కోర్ట్స్, హ్యాండీ క్రాఫ్ట్ వస్తువులు, ఫర్నీచర్, క్లాత్ స్టాల్స్, అమ్యూజ్మెంట్ పార్కు ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు ఎగ్జిబిషన్లో ట్రైన్‌పై మైదానం మొత్తం చుట్టివస్తున్నారు.
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకులు రోజురోజుకు పెరుగుతున్నారని ఎగ్జిబిషన్ సొసైటీ పబ్లిసిటీ కన్వీనర్ జీవీ రంగారెడ్డి పేర్కొన్నారు. పబ్లిసిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి 1వ తేదీన ప్రారంభమైన ప్రదర్శనకు సందర్శకులు తరలి వచ్చి స్టాల్స్‌లలో విక్రయాలు చేపడుతున్నారని తెలిపారు. నగరంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, సందర్శనకు తరలి వచ్చే సందర్శకుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడపడంతో పాటు మెట్రో రైలు సమయాన్ని పొడిగించిందన్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీ కెమెరాల నిఘా, పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు, వలంటీర్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.