సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘దళితబంధు’ పథకంలో దళారుల జోక్యం లేకుండా సంబంధిత జిల్లా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా నూతన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ‘దళితబంధు’ రెండో విడుత పథకం అమలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడుత ‘దళితబంధు’ పథకం అమలులో దళారుల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే.. అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒంటరి మహిళలు, 60 ఏండ్లు పైబడిన వారిని, నియోజకవర్గం పరిధి కాని వారిని, దళితులు కాని వారిని ఈ పథకం కింద ఎంపిక చేయవద్దన్నారు. అర్హులైన నిరుపేదలను మాత్రమే ఎంపిక చేయాలని ప్రత్యేక అధికారులకు కలెక్టర్ సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి, నిజమైన, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. దళిత బంధు యూనిట్ల పర్యవేక్షణ కోసం అధికారులతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులు వారు కొనుగోలు చేసే యూనిట్లు గుర్తింపు పొందిన ఏజెన్సీల వద్దనే తీసుకోవాలన్నారు. దళితబంధులో గ్రూపుగా ఏర్పడి స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే యూనిట్లను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.