ఖైరతాబాద్, డిసెంబర్ 4 : పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లే రహదారి అది. నిత్యం వీఐపీ మూవ్మెంట్ ఉండడంతో పాటు రాజ్‌భవన్ ఉద్యోగులు ఇక్కడ నివాసముంటారు. అంతేకాకుండా రాజ్‌భవన్ హైస్కూల్ సైతం ఇక్కడే ఉండడంతో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల సంచారం ఉంటుంది. ఇదే రోడ్డులో ఉన్న ఓ హోటల్, ప్రైవేట్ స్కూల్, ఆస్పత్రి, కొన్ని దుకాణాలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో నడిరోడ్డే పార్కింగ్ స్థలంగా మార్చుకున్నారు. ఫలితంగా ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. స్థానికంగా ఉన్న ఆర్య భవన్ హోటల్ ముందే వినియోగదారులు వాహనాలను పార్కింగ్ చేయడంతో మరింత ఇరుకుగా మారి, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే గల్లీలో ఓ ప్రైవేట్ స్కూల్ సైతం ఉండడంతో అందులో చదువుతున్న వారి పిల్లలను తీసుకువెళ్లేందుకు వచ్చే వాహనాలతో పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. రాజ్‌భవన్ స్కూల్ విద్యార్థులు సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుంటూ ఇబ్బందులపాలవుతున్నారు. పార్కింగ్ లేని వ్యాపార, వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన ట్రాఫిక్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఆయా వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.