జూబ్లీహిల్స్, అక్టోబర్ 15: గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకపోవడంతో సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం హుళక్కేనా?అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికలేవైనా యూసుఫ్‌గూడ సర్కిల్ కేంద్రంగా నిర్వహిస్తారు. అయితే నేటికీ యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయానికి సొంత భవనం లేక నాటి వార్డు కార్యాలయంలోనే కొనసాగుతుండటం విశేషం. అంతేకాకుండా అసెంబ్లీ, పార్లమెంట్, జీహెచ్ఎంసీ ఏ ఎన్నికలకైనా వేదికగా ఉండే సర్కిల్ కార్యాలయంతోపాటు డీఆర్సీ సెంటర్ ఏర్పాటు చేసే స్థానిక కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం కూతవేటు దూరంలో ఉంటుండగా.. సరైన భవనంలేక రిటర్నింగ్ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొన్నది. నాటి నుంచి చిన్నపాటి భవనంలో కొనసాగుతున్న సర్కిల్ కార్యాలయం ఉన్న సిబ్బందికే చాలక.. భవనంలో ఎలాంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
నాటి నుంచి ఇక్కడే..
ఇక ఎన్నికలు జరిగే ప్రతీసారి కీలకంగా ఉండే రిటర్నింగ్ కార్యాలయాన్ని సుదూర ప్రాంతంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేస్తుంటారు. మహానగరపాలక సంస్థ గ్రేటర్ హైదరాబాద్‌గా మారక ముందు యూసుఫ్‌గూడ అనే ప్రాంతం ఖైరతాబాద్ సర్కిల్లో ఒక వార్డుగా ఉండేది. జీహెచ్ఎంసీ ఏర్పడ్డాక చేపట్టిన జోన్ల పునర్విభజనలో శేరిలింగంపల్లి జోన్లో అంతర్భాగమై నగర పాలక సంస్థలో 19వ సర్కిల్‌గా ఏర్పడింది. కాగా, 18వ సర్కిల్లో ఉన్న షేక్‌పేట్ డివిజన్‌తోపాటు 17వ సర్కిల్ పరిధిలో ఉన్న సోమాజిగూడ డివిజన్లోని కొంత భాగమైన శ్రీనగర్కాలనీతో మమేకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సింహభాగం ఈ 19వ సర్కిల్లోని యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రెహ్మత్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లు ఉన్నాయి.
మాగంటి మరణంతో ఆగిన పనులు..
ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయం నేటికీ నాటి వార్డు కార్యాలయంలోనే కొనసాగుతుండటంతో గత ప్రభుత్వ హయాంలో సొంత భవనం నిర్మించేందుకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సుమారు రూ.6 కోట్లతో సర్కిల్ కార్యాలయం పక్కనే ఉన్న పాత సెట్విన్ కార్యాలయ స్థలంలో భవన నిర్మాణానికి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శంకుస్థాపన చేశారు. యూసుఫ్‌గూడ సర్కిల్ కార్యాలయ భవనాన్ని సెల్లార్తోపాటు జీ ప్లస్-2గా నిర్మించేందుకు అధికారులు పునాదులు, ఫౌండేషన్ స్టీల్‌తో బేస్మెంట్ పనులు పూర్తి చేశారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం.. అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు అటకెక్కాయి. ఇంతలో స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్ ఆకస్మిక మృతితో మళ్లీ అసెంబ్లీకి ఉప ఎన్నికలు వచ్చాయి. దీంతో ఎన్నికల వేళ అవే ఇబ్బందులు పునరావృతమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఆశయాలను కొనసాగించేందుకు ఉప ఎన్నిక బరిలోకి దిగుతున్న మాగంటి సునీత గోపీనాథ్ విజయం సాధిస్తేనే అర్ధాంతరంగా ఆగిన ఈ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.