మేడ్చల్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డబుల్బెడ్రూంల్లో లబ్ధిదారులు ఉండకపోతే రద్దు చేసేలా సర్కార్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు సార్లు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. మూడో సారి నోటీసులు ఇచ్చి గడువు పూర్తయిన వెంటనే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 20 డబుల్బెడ్రూం కాలనీలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. 29,105 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూంలను అందించారు. అయితే 20,801 మంది లబ్ధిదారులు డబుల్ బెడ్రూంలలో వచ్చి చేరారు. మిగతా 7,640 మంది లబ్ధిదారులు చేరాల్సి ఉంది.
కాగా బండ్లగూడ, అహ్మద్‌గూడ, జవహర్‌నగర్, తూకుంట, ప్రతాపసింగారం, రాంపల్లి, కొర్రెముల, మురహరిపల్లి, దుండింగల్, నిజాంపేట్, గాజులరామారం, డి పోచంపల్లిలో 30,368 డబుల్బెడ్రూంలు ఉన్నాయి. సౌకర్యాలు లేనందువల్లే చేరలేదని చెబుతుండగా, మరి కొందరు ఇక్కడ నుంచి పాఠశాలలు దూరంగా ఉన్నందున పిల్లల చదువులకు ఇబ్బందులవుతున్నాయని, వైద్య సేవలు అందక బస్సు సౌకర్యాలు లేక చేరలేక పోతున్నట్లు చెబుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్హులకు ఇండ్లను కేటాయించిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్బెడ్రూం కాలనీల్లో సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని ఆరోపిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ పాఠశాలలు, బస్తీ దవాఖానలు, బస్సు సౌకర్యాలు కల్పించాలని పల్లుమార్లు ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చిన రెండు కాలనీల్లోను ఇటీవల ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అన్ని రకాల సౌకర్యాలు కల్పించేవారని కాలనీ వాసులు గుర్తు చేసుకుంటున్నారు. మరికొంత కాలం గడువు ఇవ్వాలని లబ్ధిదారులుకోరుతున్నారు.