కవాడిగూడ : స్వచ్చంద సంస్థలు సేవా దృక్పదంతో జర్నలిస్టులకు చేయూత అందించడం అభినందనీయమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్(ఎస్ఆర్డీ) స్వచ్చంద సంస్ధ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ముందుండి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ముషీరాబాద్ నియోజక వర్గ జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఠా గోపాల్ మాట్లాడుతూ కరోనా సమయంలో జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గత రెండేండ్ల నుంచి మూడు దఫాలుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షనీయమని అన్నారు. ఎస్ఆర్డీ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేండ్ల నుంచి జర్నలిస్టులకే కాకుండా నిరుపేద ప్రజలకు దాదాపు 10 వేల విలువ గల నిత్యావసర సరుకుల కిట్లు అందజేశామని ఆయన తెలిపారు. అదే విధంగా జర్నలిస్టుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లే కాకుండా, వారు చదువుకునేందుకు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. వారి వివరాలను తమకు అందజేసినట్లెతే ఆర్ధిక సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, ఎస్ఆర్డీ సంస్థ ప్రతినిధులు శివ పార్వతి, శ్రీ భవాణీ శంకర్ దేవాలయం చైర్మన్ ఆర్. శ్రీనివాస్, భోలక్‌పూర్ డివిజన్ ఇన్చార్జీ బింగి నవీన్‌కుమార్, డి. శివ ముదిరాజ్, బల్లా ప్రశాంత్, నర్సింగరావు, ముషీరాబాద్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాద్యాయుడు జావీద్, జర్నలిస్టులు ఎరం నర్సింగరావు, సీహెచ్. వీరారెడ్డి, బి. కనకరాజు, టి. వేణుగోపాల్, బి. సతీష్‌కుమార్, వీరన్న యాదవ్, ప్రేమ్ సాగర్, నర్సింహ, అఖిలేష్, టీకే చారీ, జహంగీర్, టి. గణేష్‌లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.