సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): సుద్దకుంట చెరువు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో ఉన్నారంటూ బెదిరించి అక్కడ నివాసముంటున్న 48 ఇళ్లకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు మార్కింగ్ చేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్కుంట (సుద్దకుంట చెరువు) వద్ద ద్వారకానగర్ నివాసితుల ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాము 30 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నామని, ఇప్పుడు తమ నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చాయంటూ హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు బెదిరిస్తున్నారంటూ స్థానికులు రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు.
ఎఫ్టీఎల్ మార్కింగ్ చేసి ఇనుప కడ్డీలు పాతి, ఇళ్లపై నంబర్లు వేసి ఈ ఏడాది జూలైలో మార్కింగ్ చేయడంతో తాము భయభ్రాంతులకు గురై నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వారు వాపోయారు. 2014లో చెరువుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి సర్వేచేసి ఎఫ్టీఎల్ హద్దు రాళ్లు పాతినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ఎఫ్టీఎల్ హద్దులు మార్చేశారని, నివాసాల్లో చెరువు ఎఫ్టీఎల్ ఉన్నట్లుగా చూపించి ప్రజలను భయపెడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
వసూళ్లకు పాల్పడేవారిపై చర్యలు..
ఈ ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడి అన్ని మ్యాప్‌లను చూసిన రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా చెరువుల ఎఫ్టీఎల్ పేరుతో అక్రమాలకు పాల్పడే వివిధ శాఖల అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామన్నారు. చెరువుల కబ్జాదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడేది లేదని, కొందరు హైడ్రా పేరు చెప్పి వసూళ్లుకు పాల్పడుతున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. 2014లోనే సుద్దకుంట చెరువు 3.16ఎకరాల మేర ఉందని హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారని, దాని ప్రకారమే చెరువు హద్దులు నిర్ణయించి కాపాడతామన్నారు.
చెరువు హద్దులు మార్చేసి వేరొక వైపు చెరువు ఉన్నట్లుగా చూపించి ఇళ్లపై మార్కింగ్ చేసిన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇనుప కడ్డీలను, మార్కింగ్‌ను తొలగించాలని ఆదేశించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నిర్మించి నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లేది లేదని రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం చెరువుల వద్ద మిగిలిన భూమిలోనే వాటి పునరుద్ధ్దరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. ఎవరైనా లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. సుద్దకుంట చెరువు పునరుద్ధరణ, బాక్స్‌డ్రెయిన్ నిర్మాణానికి సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తానని కమిషనర్ రంగనాథ్ స్థానికులకు చెప్పారు.