సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ)/బండ్లగూడ: జిమ్‌లో అలసిపోకుండా అధిక వర్కౌట్లు చేసేందుకు రక్తపోటును పెంచే ‘మెఫటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను వినియోగిస్తున్న విషయం బయటపడింది. ఎలాంటి అనుమతి లేకుండా ‘మెఫటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను విక్రయిస్తున్న రెండు వేర్వేరు ముఠాలకు చెందిన ఇద్దరిని రాజేంద్రనగర్ డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శైలజారాణి ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 288 ‘మెఫటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ శైలజారాణితో కలిసి డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
ధూల్‌పేట ప్రాంతానికి చెందిన నితీష్(32) జిమ్ ట్రైనర్. అదే ప్రాంతానికి చెందిన రాహుల్‌తో కలిసి నితీష్ ఎలాంటి అనుమతి లేకుండా ‘మెఫటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శైలజారాణి.. మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఆదివారం సాయంత్రం దుర్గానగర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న నితీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ధూల్‌పేటకు చెందిన రాహుల్‌తో కలిసి మెఫటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద నుంచి రూ.లక్షా 89వేల విలువజేసే 126 మెఫటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ వైల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై నారాయణగూడ పీఎస్‌లో ఆయుధాల చట్టం కింద ఒక కేసు, ఆసిఫ్‌నగర్ పీఎస్‌లో మెఫటర్మైన్ ఇంజక్షన్ కేసు నమోదై ఉన్నట్లు డీసీపీ తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు వట్టేపల్లి రైల్వే గేటు వద్ద ఒక సంచితో తచ్చాడుతున్న వ్యక్తిని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి, ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పాతబస్తీ బార్కాస్‌కు చెందిన షోహెల్ నహేది (30)గా తేలింది. అతడి వద్దనున్న సంచిని పరిశీలించగా.. మెఫటర్మైన్ సల్ఫేట్ (పింక్) 61వైల్స్, గ్రీన్ 101వైల్స్, 7 ఇంజక్షన్స్ లభించాయి. వీటి విలువ రూ.2లక్షల 43వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు షోహెల్ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
మెఫటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు సాధారణంగా లోబీపీ ఉన్నవారిలో రక్తపోటును పెంచి.. నియంత్రించేందుకు వాడతారని అధికారులు తెలిపారు. జిమ్ సెంటర్లలో కొంత మంది ట్రైనర్లు అధిక వర్కౌట్లు చేసేందుకు అక్రమంగా మెఫటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్కడకు వచ్చే యువతకు అక్రమ మార్గంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అయితే, పట్టుబడిన నిందితులు మెఫటర్మైన్ ఇంజక్షన్లను ఎవరికి విక్రయించేందుకు వచ్చారో.. ఎంత కాలంగా ఈ వ్యాపారం చేస్తున్నారో.. అన్న వివరాలు విచారణలో తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేసును ఛేదించిన మైలార్‌దేవ్‌పల్లి, ఎస్ఓటీ పోలీసులను డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు.
జీడిమెట్ల, జూన్ 19 : ఎలాంటి లైసెన్స్ , డాక్టర్ చీటీ లేకుండా ఇంజక్షన్లు, స్టెరాయిడ్ టాబ్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని సనత్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ టి.శ్రీనివాస్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ర్టానికి చెందిన హరీష్ సేనాపతి (28) ఫతేనగర్ రామాలయం వీధిలో ఉంటున్నాడు. 2009లో నగరానికి వలస వచ్చిన అతడు ఉపాధి నిమిత్తం ఎలక్ట్రానిక్ షాపులో ఉద్యోగంలో చేరాడు. జీతం డబ్బులు సరిపోకపోవడంతో హెల్త్ వెల్నెస్ పేరుతో ప్రొటీన్ సప్లిమెంట్ స్టోర్‌ను ఏర్పాటు చేశాడు. కొంత కాలం తరువాత అతడికి చెన్నైకి చెందిన శ్రీనివాస్ ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. స్టెరాయిడ్ ఇంజక్షన్లు, మందులు విక్రయిస్తే తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చని సూచించాడు. హరీష్ సేనా పతి అంగీకరించాడు. ఈ మందులను వైద్యుల సూచన, ప్రిస్క్రిప్షన్ మేరకే విక్రయించాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా రూ.600 ఉన్న వాటిని రూ.1000కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. కొన్ని నెలలుగా సనత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో యువతను మోసం చేస్తూ విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫతేనగర్‌లో సనత్‌నగర్ పోలీసులు డ్రగ్ ఇన్స్పెక్టర్ సహాయంతో హరీష్ సేనాపతిని పట్టుకున్నారు. చైన్నైకి చెందిన శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. అతడి వద్ద నుంచి ప్రమాదకరమైన 33 రకాల ఇంజక్షన్లను, ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో బాలానగర్ ఏసీపీ గంగారం, డ్రగ్ ఇన్స్పెక్టర్ శివతేజ, సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్, ఎస్ఐ మురళీగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.