సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా పేరు పొందిన హైదరాబాద్‌పై కేంద్రానిది కక్షనో..? లేక వివక్షనో..? కారణం తెలియదు కానీ.. పదేపదే అన్యాయం చేస్తున్నది. ఎలాంటి అర్హతలు లేకున్నా.. బీజేపీ పాలిత నగరాలు, రాష్ర్టాలకు ప్రాజెక్టులు కట్టబెడుతూ.. ఈ ప్రాంతం పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం సాధ్యం కాదని సెలవిచ్చింది. మొదటినుంచీ బీజేపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్న సీఎం కేసీఆర్..హైదరాబాద్ నగరాభివృద్ధి మాత్రం ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూనే ఉన్నారు. కాగా, హైదరాబాద్ మెట్రో తొలి దశకు సంబంధించిన రూ.254 కోట్ల వీడీఎఫ్ నిధులను కేంద్రం ఇప్పటివరకు ఇవ్వకపోగా, తాజాగా తెలంగాణ పంపిన రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలకు ససేమిరా అనడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ మహా నగరం..అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులతో అనేక కేటగిరీల్లో విశ్వ నగరంగా గుర్తింపు పొందుతున్నది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నగరంపై ఎనలేని వివక్షను ప్రదర్శిస్తున్నది. 2014 తర్వాత దేశంలో బీజేపీపాలిత రాష్ర్టాల్లోని నగరాల్లో కొత్తగా మెట్రో రైలు ప్రాజెక్టులను మంజూరు చేయడంతో పాటు విస్తరణలకు సైతం మోదీ ప్రభుత్వం లక్షల కోట్లను మంజూరు చేసింది. కానీ కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా హైదరాబాద్ మెట్రో తొలి దశకు సంబంధించిన రూ.254 కోట్ల వీడీఎఫ్ నిధులను ఇవ్వకపోవడం ఒకవంతైతే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పంపిన రెండో దశ ప్రాజెక్టు సాధ్యం కాదంటూ తిప్పి పంపడం బీజేపీకి తెలంగాణ అంటే ఎంత అక్కసో అర్థమవుతున్నది.
దేశంలోని మెట్రో నగరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్నది హైదరాబాద్ మహానగరం. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు మధ్యలో అత్యంత అనుకూల వాతారణం ఉన్న మెట్రో నగరంగా మారిన హైదరాబాద్‌లో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఆసక్తి చూపడమే కాకుండా గత 4-5 ఏళ్లలో రెండు తెలుగు రాష్ర్టాల వారే కాకుండా ఉత్తర భారతీయులు సైతం నగరంలో సొంతంగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం నలుమూలలా విస్తరిస్తరిస్తున్నది. ఇందులో భాగంగా మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ కోసం మెట్రో రైలు శివారు ప్రాంతాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే, బడ్జెట్ నిధులు కేటాయించకపోగా, ఫీజబిలిటీ లేదంటూ ప్రాజెక్టు ప్రతిపాదనలకు లేఖలు రాసింది. అదే సమయంలో దేశంలోని ఇతర మెట్రో నగరాలు, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మాత్రం మెట్రో ప్రాజెక్టులకు అవసరమైన నిధులను పెద్ద మొత్తంలోనే కేటాయిస్తున్నది. కేంద్రం వాటాగా 40 నుంచి 50 శాతంగా ఇస్తూ ప్రాజెక్టులు చేపట్టేందుకు సహకరిస్తున్నది.
అభివృద్ధి ఆగొద్దని..
ఆది నుంచి కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరిని సునిశితంగా పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. హైదరాబాద్ నగరాభివృద్ధి మాత్రం ఒక్క క్షణం కూడా ఆగొద్దంటూ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఎయిర్‌పోర్టు మెట్రోకు శంకుస్థాపన కూడా చేశారు. కేంద్రంపై నమ్మకం లేకనే రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రోకు ఇప్పటికే శంకుస్థాపన చేయగా.. సర్వే పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కించిత్తయినా సమైఖ్య స్ఫూర్తి ఉండకపోతుందా.. అని మెట్రో రెండో దశ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం పంపింది. కానీ ఆ స్ఫూర్తి నల్లపూసే అని రుజువు చేస్తూ కేంద్రం రెండో దశపై చేతులెత్తేసింది.
మెట్రో నిధుల కోసం ప్రత్యేక లేఖ..
నగరంలో ఇప్పటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయి విజయవంతంగా కొనసాగుతున్నది. దీనికి అనుసంధానంగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో రెండో దశను పలు మార్గాల్లో రూపొందించింది. దీనికి సంబంధించి నిధులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం గత నెల ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల పేరే ఎత్తలేదు. మెట్రో రైలు మార్గాన్ని మియాపూర్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి మీదుగా మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు 28 కి.మీ, అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ మార్గాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మొండి చేయి చూపింది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ చుట్టు పక్కల ఉన్న నగరాల కోసం ప్రతిపాదించిన రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంకు బడ్జెట్లో రూ.3596 కోట్ల కేటాయించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఢిల్లీ నుంచి ఘజియాబాద్ మీదుగా మీరట్‌కు నిర్మిస్తున్నారు.