సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ ) : మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ, పాటిస్తున్న నాణ్యతాప్రమాణాలు, సిబ్బంది ఆరోగ్యంలో తీసుకుంటున్న జాగ్రత్తలకు గానూ పారిశుధ్య నిర్వహణలో జలమండలి అంబర్‌పేట ఎస్టీపీకి ఐఎస్వో ధ్రువపత్రం లభించింది. మూడు విభాగాల్లో ధ్రువపత్రం అందుకుంది. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఎస్టీపీ సర్కిల్ సీజీఎం సుజాత, జీఎం సుబ్రహ్మణ్యం సోమవారం ఎండీ దానకిశోర్‌ను కలిసి ఈ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ దానకిశోర్ సంబంధిత అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. క్వాలిటీ మేనేజ్మెంట్ (ఐఎస్వో 9001-2015), ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎస్వో 14001-2015), అక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ (ఐఎస్వో 45001-2018) ధ్రువపత్రం అందుకున్నారు. కాగా, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 25 ఎస్టీపీలు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 772 ఎంఎల్డీలు. వీటిలో 20 ఎస్టీపీలను జలమండలి నిర్వహిస్తుండగా.. వీటి ద్వారా 714 ఎంఎల్డీ మురుగును 95 శాతం శుద్ధి చేస్తున్నారు. శుద్ధి ప్రక్రియలో పీహెచ్, బీవోబీ, సీవోడీ, టీఎస్ఎస్ తదితర పారామీటర్లను ఆన్లైన్ కంటిన్యూయస్ ఇఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టం టెక్నాలజీ (ఓసీఈఎంఎస్) ద్వారా పర్యవేక్షిస్తున్నారు.