Runa Mafi | మేడ్చల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పథకం ముగిసినట్టేనా..? గ్రీవెన్స్ సెల్లో చేసిన దరఖాస్తులు నిరుపయోగమైనట్టేనా..? అధికారులు ముఖం చాటేస్తుండటంతో రైతుల్లో కలుగుతున్న అనుమానాలివి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు విడతల్లో 3,442 మంది రైతులకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేసింది. అర్హత ఉన్న సుమారు 26 వేల పైచిలుకు మందికి రుణమాఫీ కాలేదు. లబ్ధిపొందని రైతులు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తులు చేసుకుంటే.. రుణమాఫీ పథకాన్ని తిరిగి వర్తింపజేస్తామని అధికారులు ఎంతో ఆర్భాటంగా చెప్పారు.
అయితే గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేసుకున్నా.. ఫలితం లేకపోవడంతో అసలు రుణమాఫీ పొందాలంటే అర్హత ఏమిటనీ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వద్దకు వెళితే వారు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 48, 072 మంది రైతులకు రైతుబంధు కింద రూ. 79.80 కోట్లు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 17కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని రైతులు మండిపడుతున్నారు.