TGSRTC | సిటీబ్యూరో/మెహిదీపట్నం, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమవ్వడం మంగళవారం కలకలం రేపింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లింగంపల్లి నుంచి మెహిదీపట్నం చేరుకుంది.
అదే సమయంలో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి.. సెల్ఫ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా కాలేదు. అనంతరం డ్రైవర్ బానెట్ ఓపెన్ చేసి కేబుల్స్ సరిచేసేందుకు యత్నించాడు. అదే సమయంలో మంటలు చెలరేగి బస్సు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతోప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
బస్సులపై హెవీ లోడ్..?
గ్రేటర్లో ప్రతిరోజూ 2700 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉచిత బస్సుతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. గ్రేటర్లో ఉచిత బస్సుకు ముందు.. రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం తర్వాత ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.
ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2700 బస్సులపైనే ఆధారపడి ఉంది. రోజుకు 30వేల ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో బస్సు ఇంజిన్లపై లోడ్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరమ్మతులు నిర్ణీత సమయంలో జరగకపోతే మార్గ మధ్యలో ఆగిపోవడం, టైర్లు పేలడం, మంటలు వ్యాపించడం, బ్రేక్ డౌన్ కావడం లాంటివి సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రిపేర్లపై నిర్లక్ష్యం వద్దు..!
వాహనాల వినియోగం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. ప్రజా రవాణా చేసే వాహనాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షంలో డ్రైవ్ చేయడం వల్ల లైట్ నుంచి బ్రేక్ వరకు ప్రతీది నాణ్యతగా ఉండేల పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు. కండిషన్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు.
వర్షం కారణంగా వాహనాలు తరుచూ మొరాయిస్తుంటాయి. దీంతో రోడ్లపై వాహనాలు సడన్గా ఆగిపోతే.. పెట్రోల్, డీజిల్, బ్రేకులు, ఇంజన్ ఆయిల్, క్లచ్ వైర్లు తదితరాలు చెక్ చేసుకోకుంటే ప్రమాదం పొంచి ఉంటుందని మెకానిక్లు హెచ్చరిస్తున్నారు. చిన్న రిపేర్లే కదా అని తేలికగా తీసుకుంటే రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు..
ఆ ప్రభావం బైక్ ఇతర భాగాలపై పడి షార్ట్ సర్క్యూట్తో వాహనాలు బూడిదయ్యే ప్రమాదం ఉంది. ఫిట్నెస్లేని బస్సులను రోడ్డెక్కించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని పలువురు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులు బస్సుల పనితీరుపై ఆరా తీయాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగాక స్పందించడంకన్నా ముందుగానే చర్యలు తీసుకుంటే మేలని చెబుతున్నారు.