Union Budget 2025 | సిటీబ్యూరో, జనవరి 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి మెట్రో రెండో దశ విస్తరణ అత్యంత కీలకంగా మారింది. కేంద్ర వాటాతో కలిసి తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 24వేల కోట్లు కాగా, ఇందులో కేంద్రం నుంచి 18శాతం మేర ఆర్థిక సహకారం అందాల్సి ఉంది. ప్రస్తుతం ఫేజ్-2 విస్తరణ కోసం అనుమతులు కోరుతూ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు అత్యంత ముఖ్యంగా మారాయి. కేంద్రం నుంచి వచ్చే వాటా ఆధారంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగనున్నాయి.
హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించాలని, రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మించేందుకు డీపీఆర్ రూపొందించారు. ఇందులో కేంద్రం 18శాతం వాటాగా రూ. 4,230 కోట్లు.. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం వాటాగా రూ.7,313 కోట్లు.. లోన్ల రూపంలో 11,693.. పీపీపీ కంపొనెంట్గా రూ. 1033 కోట్లతో వచ్చే నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలను హెచ్ఎంఆర్ఎల్ సన్నాహాలు చేసింది.
డీపీఆర్‌కు మోక్షం లేదు
ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు ఆమోద ముద్ర ఇప్పటికీ పడలేదు. 76 కిలోమీటర్ల పొడువునా నగరం నలువైపులా విస్తరించేలా హెచ్ఎంఆర్ఎల్ రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును, రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో.. నవంబర్ మొదటి వారంలోనే కేంద్రానికి చేరింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఓవైపు ఫేజ్-2 మెట్రోను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందే తప్పా.. అందుకు తగినట్లుగా నిధుల సేకరణ అంశం క్షేత్రస్థాయిలో విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికీ ఫైలును కదలించే విషయంలో రాష్ట్ర సర్కారు ఉత్సాహానికి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. అదేవిధంగా కీలకమైన డీపీఆర్‌కు ఇప్పటి వరకు ఆమోదం లభించకపోవడంతో.. నిధుల సర్దుబాటు ఎలా ఉంటుందనేది ఇప్పుడు మెట్రో వర్గాలను ఆందోళన కలిగిస్తోంది.
కేటాయింపులు ఉంటాయా?
కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకున్నది. ఈ క్రమంలో మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలకు కేంద్రం బడ్జెట్ కేటాయింపులు జరిగితే.. ప్రాజెక్టుకు భవిష్యత్తులో నిధుల కొరత తలెత్తే పరిస్థితి ఉండదు. లేదంటే ప్రభుత్వమే సొంతంగా నిధులు సేకరించుకుని ప్రాజెక్టులను పట్టాలెక్కించాల్సిన పరిస్థితి రానుంది. ఇక ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించే దాదాపు రూ. 11,000 కోట్లకు కేంద్రం పూచీకత్తుగా ఉంటుంది. ఈ విషయంలోనూ కేంద్రం ఎలాంటి మెలిక లేకుండా ఆమోదం తెలిపితేనే నగరానికి రెండో దశ మెట్రోకు తుది రూపం రానుంది.