ఇల్లు కడుతున్నావ్.. ఏం.. పైసలు పంపాలని తెలియదా..? ఇంటి విలువ ఎంతో చూసి పంపు.. లేకపోతే నీ ఇల్లు కూలగొట్టిస్తా.. రేపటికల్లా నాకు డబ్బులు రావాలి. లేదంటే నీ ఇల్లు మొత్తం నేలమట్టం చేయిస్తా.. ఖబడ్దార్. అంటూ ఇల్లు కట్టుకునేవాళ్లకు దమ్కీ…
సిటీబ్యూరో, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): ‘ఇంట్లో గంజాయి పెట్టాలా.. డ్రగ్స్ పెట్టి పట్టించాలా.. ఏంరా బలిసిందా.. నీకు ఫోన్లు చేస్తే వస్తలేవు. పార్టీ మారమంటే మారడంలేదు. ఏం తమాషాలు చేస్తున్నావా..?’ ఇవి కాంగ్రెస్‌లోకి మారని ఇతర పార్టీ నేతలకు బాబా బెదిరింపులు.. ఇది బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ తీరు. తన డివిజన్లోని ప్రజలెవరైనా సరే ఇల్లు కట్టుకుంటే చాలు బాబాకు మామూళ్లు ముట్టాల్సిందే. కాంగ్రెస్ పార్టీలోకి తాను పిలిచిన వారు ఎవరైనా రాకపోతే వాళ్లపై అక్రమ కేసులు బనాయించడమేనట. అటువంటి ఘటనలు ఎన్ని ఉన్నా, అవి తమకు తాముగా జరిగినవేనని బాధితులు చెప్పుకుంటున్నారు తప్ప దీని వెనుక బాబా ఉన్నాడని చెబితే ఏమవుతుందోనని భయపడుతున్నారని పోలీసులే ఆఫ్‌ది రికార్డ్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బాబా మళ్లీ తన వికృత రూపాన్ని కనబరుస్తున్నాడని.. ఒకవైపు బెదిరింపులకు పాల్పడుతూనే మరోవైపు ఎవరైనా బయటకు చెబితే సీరియస్‌గా ఉంటుందని సామాన్యులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
ఆయన మాట వినకపోతే అంతే..!
బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. తన మాట వినకుంటే, తాను చెప్పిన పని చేయకుంటే, తనకు మామూళ్లు ఇవ్వకుంటే వారి పని అంతే సంగతులని డివిజన్లో చెప్పుకుంటున్నారు. అటువంటి వివాదాస్పదమైన బాబాఫసియుద్దీన్తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి బోరబండ డివిజన్లో ప్రచారం చేశారు. రోడ్‌షోలో రేవంత్ ప్రచారం చేసినంత సేపు సీఎం మీటింగ్‌కు రాకపోతే మీ సంగతి తర్వాత చెప్తానంటూ బాబా గ్యాంగ్ చేసిన హెచ్చరికల గురించే జనం మాట్లాడుకోవడం కనిపించింది. ఇప్పటికే బాబా ఫసియుద్దీన్ ఆగడాలకు మైనారిటీ నేత సర్దార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బాబాఫసియుద్దీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే బాబా కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో కొంత ప్రశాంతంగా ఉన్నామనుకున్న డివిజన్ వాసులకు మళ్లీ కాంగ్రెస్ ప్రచారంలో బాబాను స్టార్క్యాంపెయినర్గా పెట్టడంతో ఇబ్బందిగా మారిందని భయంభయంగా చెప్పుకుంటున్నారు. ఇంటింటా ప్రచారం పేరుతో తమ వద్దకు వచ్చి బాబా చేస్తున్న బెదిరింపులకు ఓటర్లంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని కాలం గడుపుతున్నారని స్థానికులు చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రచారం చేసిన క్రమంలో ఆయనతో పాటు ప్రచార రథంపై ఉన్న బాబాఫసియుద్దీన్ ఇక తనకు సీఎం అండ ఉందంటూ డివిజన్లో చెలరేగిపోతాడని, తమపై వేధింపులు పెంచుతారంటూ ప్రజల్లో చర్చ జరుగుతున్నది.
పాపం సర్దార్..!
బీఆర్ఎస్ నాయకుడు, బోరబండ డివిజన్ మైనారిటీ నేత సర్దార్ మృతిని ఈ సందర్భంగా బోరబండ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేవలం బాబాఫసియుద్దీన్ వేధింపుల కారణంగానే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని, తన తమ్ముడు వచ్చే వరకు ఇల్లు కట్టాలనుకుంటే.. నిర్మాణం జరుగకుండా పార్టీ మారమనడంతో పాటు కేసుల్లో ఇరికిస్తానంటూ రోజూ వేధించడంతో తట్టుకోలేక సర్దార్ చనిపోయాడని స్థానికులు చెప్పారు. అయితే తాము చెప్పినట్లుగా బయట అనవద్దని, ఒకవేళ బాబాకు తెలిస్తే తమ కు నూకలు చెల్లినట్లేనంటూ భయంభయంగా వెళ్లిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్న సర్దార్ అందరినీ డ్రగ్స్ కేసులో ఇరికించాలా అంటూ బెదిరిస్తున్నాడంటే ఆయనకు డ్రగ్స్ పెడ్లర్లతో లింకులున్నాయా? అనే దిశగా డివిజన్లోని కొందరు విద్యావంతుల వద్ద చర్చ జరుగుతున్నది. పెద్ద స్థాయి నాయకుడిగా చెలామణి అయ్యే బాబాకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని, ఆయన సర్దార్ మరణం టైమ్‌లో మాట్లాడిన ఆడియోలో చెప్పినట్లుగా వైట్ పౌడర్ పెట్టిస్తానంటున్నాడంటే అతనికి ఎంత పెద్ద ముఠాలతో సంబంధాలున్నాయోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటుంటే రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే, రౌడీయిజానికి కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయని డివిజన్ ప్రజలు చెప్పుకుంటున్నారు.