GHMC | సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ ): జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్ కమిషనర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లు , సంబంధిత డీడీఓతో కలిసి ప్రత్యక్షంగా పనులు పరిశీలించి అభివృద్ధి పనులపై సోషల్ ఆడిట్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాలకు అదనంగా వీటిని తప్పకుండా పాటించాలని కమిషనర్ ఇలంబర్తి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పనులకు సంబంధించిన బిల్లులు రూపొందించే సమయంలో జోనల్ కమిషనర్ల ఆమోదం తప్పనిసరి చేశారు. ప్రతి బిల్లునూ జోనల్ కమిషనర్లు పరిశీలించిన తర్వాతే ఆడిట్‌కు పంపాలని, ఈ క్రమంలో నిర్ణీత విధానాలు పాటించారా? లేదా? అన్నది చూడనున్నారు.
ఫిబ్రవరి 3న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఫిబ్రవరి 3న సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాస్తవంగా ప్రతి మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం (జనరల్ బాడీ మీటింగ్) జరగాల్సి ఉంది. గత జూలై 6న జరిగిన 9వ పాలకమండలి (సర్వసభ్య సమావేశం) అక్టోబర్‌లో జరపాల్సి ఉంది. కానీ ఐదు నెలలు గడిచినా సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు కమిషనర్, మేయర్ సిద్ధపడలేదు. ఎట్టకేలకు వచ్చే నెల మొదటి వారంలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 150 ప్రశ్నలతో పాటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన ఆర్థిక సంవత్సరం (2025-26)కు సంబంధించిన రూ.8440 కోట్ల బడ్జెట్‌పై కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనున్నది.
రెండేండ్ల పనులపై నిఘా
జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు రూ.1500కోట్ల మేర బకాయిలు పడింది. ఈ నేపథ్యంలో తరచూ ఆందోళనలు చేయడం, జూన్ నాటికల్లా రూ. 400కోట్ల మేర బకాయిలు చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిరసనను వాయిదా వేశారు. అయితే ఇటీవల జరిగిన వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు కమిషనర్ దృష్టికి వచ్చాయి. చేయని పనులకు బిల్లులు పెట్టడం, గతంలో కొందరు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఖజానాను గండి కొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో పాత బిల్లులపై నిఘా పెట్టి తనిఖీలు చేయాలని కమిషనర్ అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన నిర్వహణ పనులకు చెల్లించిన బిల్లులపై విజిలెన్స్ బృందం రంగంలోకి దిగి విచారణ చేపట్టనున్నది.