సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లీజు దందాలోనే కాదు.. అద్దెల రూపంలో భారీగానే సంస్థకు కన్నం వేసిన ఘటన బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు జాగ్రత్త పడుతుండడం పట్ల ఎస్టేట్ విభాగంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఎస్టేట్ విభాగంలో అవినీతి, అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసినా వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. గజం స్థలానికి రూ.1 అద్దె చెల్లిస్తోన్న లీజు ఒప్పందాలు నేటికీ యథాతథంగా కొనసాగుతున్నాయి.
అజాద్ (మోతి) మార్కెట్ లీజుల గడువు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. రూ.కోట్లాది రూపాయల మేర జీహెచ్ఎంసీ ఖజానాకు గండిపడుతున్నా ఎస్టేట్ విభాగం అధికారుల్లో చలనం కరువైంది. ఈ క్రమంలోనే మున్సిపల్ మార్కెట్లు, కాంప్లెక్స్లతో పాటు సంస్థ ప్రధాన కార్యాలయం, ఇతర జోనల్ కార్యాలయాల్లోని 14 యూనియన్ కార్యాలయాలతో పాటు 2300 షాపులకు లీజు గడువు ముగిసినట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. తాజాగా సికింద్రాబాద్ జోనల్ పరిధిలో భారీ అవినీతి, అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
జోనల్ పరిధిలో దాదాపుగా 300 షాపులు ఉండగా..వీటి నుంచి ఏడాది రూ. 20-25 లక్షల మేర ఆదాయం అద్దె రూపంలో సంస్థ ఖజానాకు చేరాల్సి ఉంది. కానీ ఇక్కడే కొందరు అక్రమార్కులు ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని అసరాగా చేసుకున్నారు. నెలవారీ అద్దెలను దారి మళ్లించి సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. దాదాపుగా రూ. కోటికిపైగా ఆదాయానికి గండి కొట్టినట్లు ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఇద్దరు రెంటల్ కలెక్ట్ చేసుకునే వారు, ఆఫీస్ సబార్డినేటర్, ఆపరేటర్ కలిసి మరీ ఈ దందా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకరిని సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారని, ఒకరినే బలి పశువును చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా షాపుల అద్దెల సొమ్మును దారి మళ్లించిన ఘటనలో ఆపరేటర్ కీలకంగా ఉన్నాయని, బోయిన్పల్లి మార్కెట్లో ఇతనికి సంబంధించి రెండు షాపులు ఉన్నాయని, నెలకు రూ.50వేల వరకు అద్దెల రూపంలో ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కమిషనర్ ఇలంబర్తి ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.