సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనుల టెండర్లలో కొందరు ఇంజినీర్లు అక్రమాలకు తెరలేపారా? సామాన్యులు కాంట్రాక్టర్లుగా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన జీవో నంబర్ 66కు విరుద్ధంగా పనులు అప్పగిస్తున్నారా? పనిచేసిన అనుభవం (ఎలిజిబులిటీ) నిబంధనను చేర్చి ఒక్క కంపెనీకే తరచూ పట్టం కడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సింగిల్ టెండర్ వచ్చినా సరే…టెండర్లో ఎంత మంది పాల్గొన్న ఆ ఒక్క ఏజెన్సీకే పనులు దక్కడం పరిపాటిగా మారుతున్నది.
ఇటీవల కాలంలో మాసబ్‌ట్యాంక్, టౌలిచౌకీ, షేక్‌పేట, తెలుగు తల్లి ఫ్లై ఓవర్లకు ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనులు దాదాపు రూ. 40కోట్ల మేర జరగగా…ఒక్క ఏజెన్సీకే ఈ పనులన్నీ చేపట్టడం, సదరు ఏజెన్సీపై మిగతా కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్న క్రమంలోనే తాజాగా శిల్పా లే అవుట్ ఫేజ్-1 ఫ్లై ఓవర్‌కు రూ.1.64కోట్ల పనులను ఈకో సంస్థ దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్‌కు ముగ్గురు పోటీ పడగా.. అనుభవం అనే సాకుతో సదరు అధికారులు ఈకో సంస్థను అర్హతగా ఎంపిక చేశారు.
ఏపీకి చెందిన వ్యక్తి చెప్పుచేతల్లో కొందరు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనుల్లో జరుగుతున్న అక్రమాలపై జీహెచ్ఎంసీ కమిషనర్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమతున్నామని కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతలు చెబుతుండడం గమనార్హం. కొందరు ఇంజినీర్లు ఇప్పటికే సదరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇచ్చిన ఆఫర్లతో విదేశీ పర్యటనలు, తీర్థయార్థలు, విలాసవంతమైన ప్లాట్లు, కార్లు సమగ్ర వివరాలతో విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంటున్నారు.
ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అధికారుల భరతం పడతామని స్పష్టం చేస్తున్నారు. అయితే శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వంతెన పెయింటింగ్ పనులను మాత్రం టెండర్ నిబంధనల ప్రకారమే జరిగినట్లు ఎస్ఈ శంకర్ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాజా పనులకు 3-5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం మేర రంగులు వేసిన సంస్థనే టెండర్లో పాల్గొనేలా నిబంధనలు పెట్టి రెగ్యులర్ ఏజెన్సీకే పనులు వెళ్లేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్లై ఓవర్లను అత్యంత సుందరంగా , సంప్రదాయం ఉట్టిపడేలా, కళ్లకు ఇంపుగా అనిపించేలా కలర్‌ఫుల్ చిత్రాలను వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నది. వివిధ జోన్లలో ఉన్న ఫ్లై ఓవర్లకు పెయింటింగ్ వేసేందుకు టెండర్లు పిలుస్తూ వస్తున్నారు. అయితే టెండర్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నది. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో పనులకు అర్హత నిబంధనలను జీవో 94 ప్రకారం నిర్ణయించేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో జీవో 94 కారణంగా సామాన్యులు కాంట్రాక్టర్లుగా పనిచేసే అవకాశాన్ని కోల్పోతున్నారని జీవో నం. 66ను తీసువచ్చారు. దీని ప్రకారం గత అనుభవం అవసరం లేని పనులను కూడా కొత్త వారికి అప్పగించవచ్చు. కానీ అధికారులు పనిచేసిన అనుభవం (ఎలిజిబులిటీ) నిబంధనను చేర్చి ఒక్క కంపెనీకే పనులు కట్టబెడుతూ వస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
వాస్తవంగా సదరు ఈకో సంస్థ తొలుత అనుభవం లేనప్పుడు కూడా పనులు అప్పగించడమే కాదు…ప్రస్తుతం అనుభవం ఉందని ఆ ఏజెన్సీకే పనులు అప్పగిస్తున్న తీరు చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఏజెన్సీ ఇటీవల కాలంలో రూ. 40 కోట్లకు పైగా పనులు అప్పగించడం వెనుక ఆక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. టౌలీచౌకీ, షేక్‌పేట ఫ్లై ఓవర్ల పెయింటింగ్ పనులు అర్హత లేదని ఎవరూ పాల్గొనకపోతే ఈకో సంస్థకే కట్టబెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వ్యాఖ్యానిస్తున్నారు. సింగిల్ టెండర్ దాఖలు చేసిన సందర్భాల్లో కమిషనర్ అనుమతి తీసుకున్న తర్వాతనే సంబంధిత ఏజెన్సీకి పనులు అప్పగించాల్సి ఉంటుంది. కానీ పెయింటింగ్ టెండర్ల విషయంలో మాత్రం, అనుభవం ఎమర్జెన్సీ ముసుగులో అయిన వారికి పనులు అప్పజెప్పడం ఎంత వరకు సమంజసమని కాంట్రాక్టర్ల అసోసియేషన్ నేతలు మండిపడుతున్నారు.
సుందరీకరణ పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లకు ఆర్టిస్టిక్ పెయింటింగ్ పేరుతో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా మన ఇంటి లోపల పెయింటింగ్ వేయిస్తే స్కేర్ ఫీట్‌కు రూ.35లు, అందులో డ్యామ్ ఫ్రూఫ్‌తో వేయించినా మార్కెట్లో రూ.65 మించి కాదు. కానీ మాసబ్‌ట్యాంక్, టౌలీచౌకీ, షేక్‌పేట, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పనులకు స్కేర్ ఫీట్ రూ.110 నుంచి రూ.170లు ఖర్చు చేయడం గమనార్హం. ఫైన్ ఆర్ట్స్ వారితో ఈ పనులు అప్పగిస్తే తక్కువ ఖర్చుతో అయ్యేది.ఖజానాకు ఆదాయం కలిసివచ్చేది. కానీ అధిక వ్యయంతో జరుపుతున్న పనులపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన పనుల్లో నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించలేదని, ఫ్ల్లై ఓవర్ల పెయింటింగ్ కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నా నాణ్యత లేదని, డ్యామ్ ఫ్రూఫ్ వేసి పెయింట్ వేస్తే కలకాలం ఉండాల్సిన చోట పనులను మమ అనిపించారన్న చర్చ జరుగుతున్నది. ఇందుకు మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ పెయింటింగ్ కొన్నాళ్లకే మసకబారిందన్న వాదనలు బలం చేకూరుతున్నాయి.
టెండర్లలో ఎలిజిబులిటీ అనే పదంతో ఎవరికీ రాకుండా రెగ్యులర్ చేసే ఏజెన్సీకే అనుకూలంగా వచ్చేలా కొందరు ఇంజినీర్లు పనులను చక్కబెడుతుండడం గమనార్హం. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నీ తానై చక్రం తిప్పుతున్నారని, కొందరి అధికారులకు సకల సదుపాయాలు కల్పిస్తూ పనులు దక్కించుకుంటున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఒక వర్క్ పెండింగ్‌లో ఉండగా మరో వర్క్ అప్పగించవద్దని, కానీ టెండర్లలో పాల్గొనే ముందు పెండింగ్ వర్క్స్ ఏమీ లేవని రిపోర్ట్ దాఖలు చేస్తూ అడ్డదారిలో పనులు దక్కించుకుంటున్నారని ఈకో సంస్థపై కాంట్రాక్టర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సదరు ఏజెన్సీకి ఐటీ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడి నుంచి క్లియరెన్స్ రాకముందే తాజాగా పనులు ఎలా అప్పగిస్తారన్న వాదనలు వినిపిస్తున్నారు. ఆర్టిస్టిక్ పెయింటింగ్ పనులపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నది.