సిటీబ్యూరో: ఐపీఎల్ సీజన్ మొదలైంది. హైదరాబాద్‌లో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టి ప్రమోటర్స్‌పై కేసులు పెడ్తుంటే మరోవైపు బెట్టింగ్ మాఫియా ఇవేవీ పట్టనట్లు తమ పని తాము చేసుకుపోతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంలో పలు నిషేధ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నడుస్తున్నది. ఈ బెట్టింగ్‌లో ఎక్కువశాతం యువతే పాల్గొని డబ్బులు కోల్పోతున్నట్లు పోలీసులు చెప్పారు.
పందేలు కాసేవారు బుకీల దగ్గర కోడ్ భాష వాడుతూ తమ ఆట కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌లో గెలిచినవారికి డబ్బులు ఎలా ఇవ్వాలో కూడా ముందుగానే మాట్లాడుకుంటున్నారు. బెట్టింగ్‌లో పాల్గొంటున్న యువత వాడే కోడ్ భాషలో లెగ్ అనే పదం కీలకమైంది. ఎన్ని లెగ్గులు తీసుకుంటే లెక్క ప్రకారం అంత మొత్తం చెల్లించాలని దాని అర్ధం.
అలాగే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టుపై పందెం కాసేందుకు ప్లేయింగ్ అనే పదాన్ని, తక్కువ అవకాశాలున్న జట్టుపై ఈటింగ్ అనే పదాలు వాడుతున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారుగా 180 చోట్ల ఈ బెట్టింగులు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు నగర సీపీ సీవీ ఆనంద్ సీరియస్‌గా ఉన్నారు. బెట్టింగ్‌లకు పాల్పడినా, వారికి ఎవరూ సహకరించినా కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.