సిటీబ్యూరో, జనవరి 21 ( నమస్తే తెలంగాణ ) : జాతీయ సైన్స్ దినోత్సవం(National Science Day) సందర్భంగా కౌమార దశలోని బాల బాలికల కోసం సైన్స్ ఫిక్షన్ కథల పోటీలు(Science fiction story Competitions) జరగనున్నాయి. ఈతరం పిల్లల్లో శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ అవగాహన కలిగించడానికి శాస్త్రీయ ఆలోచనలు, ధృక్పథం, శాస్త్రీయ కల్పనలు వంటివి పెంపొందించడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలో పాల్గొనడానికి 6 తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న విద్యార్థుల నుంచి రచనలు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఉన్న ఏ పిల్లలైనా రచనలు పంపొచ్చని వివరించారు.
విదేశాల్లో తెలుగు పిల్లలు కూడా పంపొచ్చని పేర్కొన్నారు. నియమ నిబంధనలకు లోబడి తెలుగులో రాసి పంపించాలని సూచించారు. సైన్స్ ఫిక్షన్ కథలను మాత్రమే పోటీలకు పంపాలని తెలిపారు. 8 పేజీలు మించకుండా కథ ఉండాలని వివరించారు. ఫిబ్రవరి 20లోపున రచనలు పంపాలని సూచించారు. పది ఉత్తమ కథలను ఎంపిక చేసి బహుమతులు అందిస్తామని వెల్లడించారు. మరింత సమాచారం కోసం వి. ఆర్. శర్మ-9177887749, గరిపెల్లి అశోక్-9849649101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.