హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. జాహెద్, సమీయుద్దీన్, హసన్‌లను సిట్ అధికారులు విచారించారు. ఈ నెల 12 నుంచి ఈ విచారణ జరుగుతోంది. వీరిని ఒక రహస్య ప్రదేశంలో ఉంచిన అధికారులు.. విచారణ జరిపారు. ఈ క్రమంలో జాహెద్ ఎంత మందిని నియమించాడనే విషయంపై ఆరా తీశారు. వారిలో హైదరాబాద్‌లో ఎంతమంది ఉన్నారని కూపీ లాగారు.
పాక్ నుంచి వచ్చిన నిధులతోనే జాహెద్ కొత్త కారు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కారు ఎక్కడ ఉందని అధికారులు ప్రశ్నించారు. అలాగే జమ్మూ నుంచి మనోహరాబాద్‌కు రైల్లో గ్రనేడ్లు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం బైక్‌పై అక్కడకు వెళ్లి నాలుగు గ్రనేడ్లు తెచ్చినట్లు నిందితులు వెల్లడించారు. పాక్‌లో ఉండే ఫర్హతుల్లా ఆదేశాలతోనే వీరందరూ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
వీళ్లంతా సమీయుద్దీన్ ఫోన్ నుంచి పాక్‌లోని ఉగ్రవాదులకు కాల్స్ చేసి మాట్లాడుతున్నట్లు తేలింది. వీళ్లు మాట్లాడుకున్న కోడ్ భాషను జాహెద్‌తో పోలీసులు డీకోడ్ చేయించారు. ఈ ముగ్గురికీ వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సిట్ అధికారులు వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 2వ తేదీన ఈ ముగ్గురినీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసిన ఆరోపణలపై వీరు అరెస్టయ్యారు.