సిటీబ్యూరో: దుబాయ్ ధీరమ్స్ తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మిస్తూ.. అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ షేక్, వాహిద్షేక్, నిషా, బీహార్‌కు చెందిన హాసీమ్ ఆలం, మహ్మద్ అలీ షేక్, యూపీకి చెందిన షేక్ నిసార్ అహ్మద్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. చిన్న చిన్న వ్యాపారుల వద్దకు వెళ్లి దుబాయ్ కరెన్సీ ధీరమ్ తమ వద్ద ఉన్నదని, ఇండియన్ రూపాయలు ఇస్తే తక్కువ ధరకు వాటిని ఇస్తామంటూ నమ్మిస్తారు. రద్దీ ప్రాంతాలలో ఉండేవారిని ఎంచుకుంటారు.
ఈ ముఠా మాటలు నమ్మి.. విదేశీ కరెన్సీని మార్చుకోవాలనుకునే వారి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. బండిల్స్‌లో పైనా, కింద ధీరమ్స్ పెట్టి.. బాధితుల దృష్టి మళ్లించి నోట్ల కట్టలు వారి చేతిలో పెడతారు. వారిచ్చే రూపాయలు తీసుకొని.. అక్కడి నుంచి పరారవుతారు. బాధితుల ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి, తిరుమలగిరిలో కేసులు నమోదయ్యాయి. దీంతో నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి బృందం రంగంలోకి దిగి.. ఈ ముఠాను అరెస్ట్ చేసింది. ఈ ముఠా నుంచి రూ. 7.47 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి వచ్చే ముఠాలపై జాగ్రత్తగా ఉండాలని, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని డీసీపీ సూచించారు.