సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర మత్తు ముఠా సభ్యులను మహారాష్ట్రలో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన బుర్ర రమేశ్, రాజ్‌కుమార్‌కు గుజరాత్లో క్లోరో హైడ్రేడ్ (సీహెచ్)వంటి నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. దీంతో నిందితులు ముంబైకి చెందిన రాజుబాయ్తో కలిసి తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లోని మత్తు వ్యాపారులకు సీహెచ్‌ను సరఫరా చేస్తున్నారు.
వీరి వద్ద నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన రామాగౌడ్, అక్కం మధుగౌడ్, రవీందర్‌రెడ్డి, గుండేపల్లి బాల పవన్‌గౌడ్, సారా నరేశ్ గౌడ్, వెంకటరమణ తదితరులు క్లోరో హైడ్రేడ్ మత్తు మందును కొనుగోలు చేసి హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొందరు కల్లు కంపౌండ్ల నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో జోరుగా కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమచారం అందుకున్న ఆబ్కారీ పోలీసులు.. గత జనవరి 3న మత్తు మందు సరఫరా చేస్తున్న రామాగౌడ్, అక్కం మధుగౌడ్, రవీందర్‌రెడ్డి, గుండేపల్లి బాల పవన్‌గౌడ్, సారా నరేశ్ గౌడ్, వెంకట రమణను అరెస్టు చేయగా.. ఆ కేసులో మత్తు మందు సరఫరా చేసిన ప్రధాన నిందితులు రాజు భాయ్, బండారి రాజ్‌కుమార్ పరారీలో ఉన్నారు.
అయితే, మత్తు మందు సరఫరా చేసే ప్రధాన నిందితులు మహారాష్ట్రలో తిష్టవేయడంతో వారిని పట్టుకునేందుకు రంగారెడ్డి జిల్లా ఏఈఎస్ జీవన్ కిరణ్ నేతృత్వంలో ఆబ్కారీ డైరెక్టర్ రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఏఈఎస్ జీవన్ కిరణ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రామాగౌడ్‌ను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు.. ఏఈఎస్ మాధవయ్య, ఇన్స్పెక్టర్లు సుభాష్ చందర్రావు, నర్సిరెడ్డి, వేణుకుమార్, ఎస్ఐలు బాలు, అఖిల్ తదితర సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి మహారాష్ట్రకు వెళ్లారు.
కొత్త ముంబైలోని కలోజా ఠాణా పరిధి, చీవండి ప్రాంతంలో రాజుబాయ్ ఇంటిపై దాడులు జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 2 కిలోల సీహెచ్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు బుర్ర రమేశ్ ఇంటిపై కూడా దాడులు జరిపి 25 కిలోల సీహెచ్‌ను స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. అనంతరం పుణెకు చేరుకున్న ఆబ్కారీ బృందాలు అక్కడ బండారి రాజ్‌కుమార్ ఇంటిపై దాడులు జరిపి అతడిని కూడా అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి 29 కిలోల సీహెచ్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహారాష్ట్రలో అరెస్టు చేసిన రాజు భాయ్, బండారి రాజ్‌కుమార్, బుర్ర రమేశ్‌ను స్థానిక కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై బుధవారం నగరానికి తీసుకువచ్చి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 56 కిలోల క్లోరో హైడ్రేడ్ మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా ఏఈఎస్ జీవన్ కిరణ్, మాధవయ్య, ఇన్స్పెక్టర్లు సుభాష్ చందర్రావు, నర్సిరెడ్డి, వేణుకుమార్, ఎస్ఐలు బాలు, అఖిల్ తదితర సిబ్బందిని ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.