Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): గంజాయి మత్తులో గన్స్ దందా చేయాలని అంతర్రాష్ట్ర ముఠాలు ప్లాన్లు చేస్తున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి జీవనోపాధి కోసం వచ్చి వివిధ సంస్థల్లో కార్మికులుగా పనిచేసే వారిని, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని గంజాయి చాక్లెట్లు, గంజాయి, ఓపీఎం వంటి డ్రగ్స్‌ను విక్రయించే ముఠాలను తరచూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసులు హైదరాబాద్‌లో గన్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న బీహార్‌కు చెందిన శివ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, గురువారం మూడు గన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గతంలో చర్లపల్లి పోలీసులు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండడంతో పట్టుకున్నారు. ఇతడిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలా మొదట గంజాయి, గంజాయి చాక్లెట్లతో ఇక్కడి పరిస్థితిని అంతర్రాష్ట్ర నేరగాళ్లు అంచనా వేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీహార్‌లో ఒక్కో గన్ రూ. 15 వేలు, ఒక లైవ్ బుల్లెట్ రూ. 700తో కొనుగోలు చేసి, ఇక్కడి క్రిమినల్ గ్యాంగ్స్‌కు వారి అవసరాలు, అవకాశాలను బట్టి ధరలను నిర్ణయించి అమ్మేందుకు శివ్‌కుమార్ పక్కా ప్లాన్ చేశాడు. అయితే రాచకొండ పోలీసులు ఆ అక్రమాయుధాలు క్రిమినల్ గ్యాంగ్స్‌కు చేరకముందే నిఘా పెట్టి పట్టుకున్నారు. గంజాయి విక్రయాలు, గంజాయి సిట్టింగ్‌లలో బీహార్, యూపీ, రాజస్థాన్‌కు చెందిన వారు గన్స్ విక్రయాలు, వాటికి హైదరాబాద్‌లో మార్కెట్ ఎలా ఉందనే విషయాలను చర్చించుకుంటున్నారు. గంజాయిని పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ పరిమాణంలో తెచ్చి కొందరు వాడుకోవడం, దానిని మార్కెట్లో విక్రయించే వాళ్లు చాలా మందే ఉన్నారు. పలు ఘటనలలో ఆయా రాష్ర్టాలకు చెందిన ముఠాలు గంజాయి, గంజాయి చాక్లెట్లు, ఓపియం అమ్ముతూ పోలీసులకు పట్టుబడిన ఘటనలున్నాయి.
మార్కెట్ ఉందనే..
రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన శివ్‌కుమార్, అతని బావ కృష్ణపాశ్వాన్ తయారు చేసిన కంట్రీమేడ్ గన్స్‌ను కొనుగోలు చేశాడు. కృష్ణ పాశ్వాన్ తమ స్వస్థలంలో గన్స్ తయారీ కేంద్రానే నిర్వహిస్తుండడంతో ఈజీగా గన్స్‌ను అవసరమున్న వారికి సరఫరా చేయవచ్చని ఫ్లాన్ చేసుకున్నారు. బీహర్‌లో చాలా మంది అక్రమ పద్ధతిలో ఈ అక్రమాయుధాలను తయారు చేస్తుండడం గత కొన్నేళ్లుగా సాగుతున్నది. అక్కడ గన్స్ తక్కువ ధరకు ఈజీగా లభిస్తున్న విషయం ఎవరూ కాదనలేని నిజం. రాచకొండ పోలీసులు ఏడాది వ్యవధిలో నాలుగు గ్యాంగ్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి ఇప్పటి వరకు 18 అక్రమాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ నేరస్తుల చేతికి వెళ్లముందే పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇంకా నిఘాకు చిక్కకుండా విక్రయిస్తున్న వారు ఉండే అవకాశాలున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. గంజాయి విక్రయాలు సాగే సమయంలోనే నేర స్వభావం ఉన్న వారితో పరిచయాలు అవుతున్నాయి. ఇలా బీహార్, యూపీలలో తక్కువ ధరకు గన్స్ దొరుకుతాయనే భావనలో ఆయా నేర స్వభావం ఉన్న వారు గంజాయి విక్రయాలు సాగించే అంతర్రాష్ట్ర ముఠాలతో మాట్లాడడంతోనే గన్స్ తెచ్చి ఇక్కడ విక్రయించి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఈ అంతర్రాష్ట్ర ముఠాలు చేస్తున్నట్లుగా ఉందంటూ కొందరు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. డ్రగ్స్‌కు, అక్రమ గన్స్కు లింక్‌లు బయటపడుతుండడంతో పోలీసు వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వెనుక నుంచి మద్దతు..
బీహార్‌లో ఉండే ప్రధాన అక్రమాయుధ తయారీ, విక్రయాల ముఠాలు ఇక్కడుండే వారికి పూర్తి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డా, బీహార్, యూపీకి ఇంత దూరం పోలీసులు రారనే భావన కూడా ఆయా గ్యాంగ్‌లకు ఉండడంతో హైదరాబాద్‌కు సరఫరా చేసేందుకు వెనుకాడడం లేదు. పోలీసులు మూలాల వరకు వెళ్లి ఆయా గ్యాంగ్‌లను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే భయం అనేది వస్తోంది. గతంలో గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా అవుతున్నదని గుర్తించిన పోలీసులు, అక్కడకు వెళ్లి కొన్ని రోజుల పాటు నిఘా వేశారు. డ్రగ్స్ గోవాకు ఎలా వస్తోంది… అక్కడి నుంచి హైదరాబాద్‌కు ఎలా వస్తోందనే రూట్‌ను గుర్తించారు. పక్కా వివరాలు సేకరించిన తరువాత గోవాలోని డ్రగ్ డాన్స్‌పై దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఇలా కొన్నాళ్ల పాటు హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసేందుకు ఆయా ముఠాలలో భయం నెలకొంది. అలాగే అక్రమాయుధాల కేసుల్లోనూ మూలాల వరకు వెళ్లి అక్కడి అక్రమాయుధాల గ్యాంగ్‌లను పట్టుకొస్తే వారిలో భయం నెలకొంటుందని ప్రజలు సూచిస్తున్నారు. అయితే ఇక్కడ గన్స్‌ను విక్రయించేందుకు ప్రయత్నించిన ఆయా ముఠాలకు సంబంధించిన వాళ్లు పోలీసులకు చిక్కడంతోనే, విషయం బీహార్, యూపీ, ఇతర ప్రాంతాలలోని వారికి వెళ్లడం, వాళ్లంతా తమ అడ్డాలను మార్చేస్తుండడం కూడా జరుగుతుందని దీంతోనే ప్రధాన సూత్రధారులు తరుచు తప్పించుకుంటున్నారనే వాదన కూడా పోలీసులు చెబుతున్నారు. గంజాయి, గంజాయి చాక్లెట్ల మాటున జరుగుతున్న గన్స్ దందాను పోలీసులు ఎలా అరికడుతారో వేచి చూడాలి.