సిటీ బ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ): ప్రకృతిని ఆస్వాదిస్తూ నిత్యం యోగాసనాలు చేయడం వల్ల ఎలాంటి వ్యాధులకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం డీఈఓ, డీఎంహెచ్ఓ, ఆశవర్కర్ల ఆధ్వర్యంలో బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని యోగాసనాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, జీవన శైలిలో సమతుల్యతకు యోగా ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని, దినచర్యలో భాగంగా యోగాను భాగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి మాట్లాడుతూ సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు ప్రభుత్వం ఆశ వర్కర్లకు శిక్షణ ఇస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ ముకుంద రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, డీఈవో రోహిణి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, జిల్లా అధికారులు, ఆశవర్కర్లు, వైద్యశాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సనాతన ధర్మంలో యోగా భాగం
సిటీ బ్యూరో, జూన్ 21 (నమస్తే తెలంగాణ): యోగా అనేది సనాతన ధర్మంలో భాగమని స్వామి రామ్‌దేవ్ బాబా అన్నారు. దీన్ని ప్రస్తుతం 200 దేశాల్లో 200 మంది ప్రజలు అనుసరిస్తున్నారని తెలిపారు. కురుక్షేత్రంలో పతంజలి యోగాపీఠం, హర్యానా యోగా కమిషన్, హర్యానా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హర్యానా సీఎం నాయబ్ సింగ్షైనీ తదితరులు పాల్గొన్నారు.
యోగా డేలో తోపులాట నర్సింగ్ విద్యార్థినికి అస్వస్థత
శేరిలింగంపల్లి, జూన్ 21: గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో తోపులాట చోటుచేసుకుంది. గాంధీ దవాఖానకు చెందిన నర్సింగ్ విద్యార్థిని స్వల్ఫ అస్వస్థతకు గురైంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ప్రభుత్వం గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వారందరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. టిఫిన్ అయిపోవడంతో మళ్లీ మరో ట్రాలీలో తీసుకొచ్చారు.
కాగా టిఫిన్ కోసం టోకెనులతో వేచి ఉన్న వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. ట్రాలీ వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో గాంధీ నర్సింగ్ విద్యార్థిని నజిమాను మెడ, కడుపుపై తొక్కడంతో అస్వస్థతకు గురైంది. అధికారులు వెంటనే ఆమెను కొండాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. సిటీస్కాన్కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో నజీమాను పరీక్షించిన వైద్యులు అవసరమైన వైద్య చికిత్సలందించి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు.