అబిడ్స్, ఫిబ్రవరి 14: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ముగింపు ఉత్సవాలు శుక్రవారం జరిగాయి. ఇందుకు ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఈ ప్రదర్శనకు ఇప్పటి వరకు 17 లక్షల 46 వేల 313 మంది సందర్శకులు వచ్చారని తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి చిన్న, మధ్య తరగతికి చెందిన వ్యాపారులు ఉత్పత్తి చేసిన వస్తువులను విక్రయించుకునేందుకు మన నుమాయిష్ వేదిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 20 విద్యా సంస్థలను నడపడం ఎంతో గొప్ప విషయమన్నారు.
46 రోజుల పాటు కొనసాగే ఈ నుమాయిష్ ప్రదర్శనలో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు వివిధ రాష్ర్టాల నుంచి వేల మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ వస్తువులను విక్రయించి లాభాల బాటన పడుతున్నారన్నారు. 46 రోజుల పాటు నుమాయిష్‌ను సజావుగా నిర్వహించడం కత్తి మీద సాము లాంటిదని, ఇలాంటి ప్రశాంత వాతావరణంలో ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఎంతో సమన్వయంతో ప్రదర్శనను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. 17 ప్రభుత్వ విభాగాలను అనుసంధానం చేయడం వలన నుమాయిష్ విజయవంతంగా కొనసాగుతూ, రోల్ మోడల్‌గా నిలబడిందని తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాలతో మూడో తేదీ నుంచి ప్రారంభించడం జరిగిందన్నారు.
స్టాల్ యజమానుల అభ్యర్థన మేరకు రెండు రోజుల పాటు నుమాయిష్‌ను పొడిగించినట్లు తెలిపారు. అనంతరం, సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించగా, వారికి గోల్డ్ మెడల్‌తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే విధంగా నుమాయిష్‌లో 46 రోజుల పాటు సందర్శకులకు ఉత్తమ సేవలను అందించిన స్టాల్ నిర్వాహకులు, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, కోశాధికారి డాక్టర్ బి.ప్రభాశంకర్, కార్యక్రమ సలహాదారులు వనం వీరేందర్, కన్వీనర్ ధీరజ్ కుమార్ జైస్వాల్, సభ్యులు అలేఖ్య పుంజాల, వినయ్ కుమార్ ముదిరాజ్, డాక్టర్ గంగాధర్, సుఖేశ్ రెడ్డి, ఆదిత్య మార్గం, అశ్విన్ మార్గం, రవి తదితరులు పాల్గొన్నారు.