Kites Festival | సిటీబ్యూరో, జనవరి 15 ( నమస్తే తెలంగాణ ): సంక్రాంతి పండుగలో అత్యంత ఆహ్లాదభరిత ఘట్టం పతంగులు ఎగురవేయడం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుటుంబ సమేతంగా పతంగులను ఎగురవేస్తూ సంతోషభరితంగా గడుపుతారు. మంగళవారం సంక్రాంతి పండుగ రోజున నగరవాసులు పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు. ఓ వైపు పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కొలువుదీరండంతో వేలాదిగా జనం తరలొచ్చి పతంగుల ఫెస్టివల్‌ను ఎంజాయ్ చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సుమారు 50 మంది కైట్ ప్లేయర్స్ వివిధ రకాల ఆకారాల్లో ఉన్న పతంగులను ఎగురవేసి నగరవాసుల్లో ఉత్సాహం నింపారు.
మరోవైపు అక్కడే జరిగిన ఫుడ్ ఎగ్జిబిషన్ సైతం తీరొక్క రుచులను అందించడంతో నగరవాసులు తమకు నచ్చిన వంటకాలు కొనుగోలు చేసి రుచి చూశారు. మరోవైపు అపార్ట్మెంట్స్, భవంతులపై కుటుంబ సమేతంగా పతంగులను ఎగరవేసస్తూ సంగీతాన్ని ఆస్వాదించారు.నదిలో ఈతలాడుతున్న కొంగ పతంగి, చిరుతపులి పతంగి, తామర పువ్వుల పంతుగులు, దేశభక్తిని చాటే ఆజాదీకాఅమృత్ మహోత్సవ్ పతంగులు, శంఖం ఊదుతున్నట్టుగా కనిపించే పతంగులు, దేవతల బొమ్మల పతంగులు ఆకాశంలో ఎగురుతూ అందరినీ కనివిందు చేశాయి.
శిల్పారామాల్లో సంక్రాంతి సంబురాలు
ఉప్పల్/కొండాపూర్, జనవరి 15 : మాదాపూర్,ఉప్పల్‌లోని శిల్పారామాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని శిల్పారామంలో సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గంగిరెద్దుల విన్యాసాలు, బుడబుక్కలు, జంగమదేవరులు, హరిదాసులు, ఎరుకలసానిలు, యక్షగానం, గారడీ గొంబె జనపద నృత్యాలను తిలికిస్తూ సందడి చేశారు.
ఖైరతాబాద్: నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మనవడు, మనుమరాండ్లతో కలిసి ఆయన పతంగులు ఎగరవేసి సందడి చేశారు.