Contonment BJP | కంటోన్మెంట్ : హైదరాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీలో అంతర్గత కొట్లాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బోర్డు నామినేటెడ్ సభ్యుడి ఒంటెద్దు పోకడలతో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నేతలకు అన్యాయం జరుగుతోందన్న నిరసన స్వరం వినిపిస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓ నేత ఇంట్లో రెండు రోజుల క్రితం పలువురు వార్డు అధ్యక్షులతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో సహా దాదాపు 30 మంది ముఖ్య నేతలు రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం పార్టీని నమ్ముకుని ఏండ్ల తరబడి కష్టపడుతున్నా.. సదరు కీలక నేత వల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించినట్లు తెలుస్తోంది.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారికి కాకుండా తన అనుయాయులకే పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని, బీజేపీ అధిష్ఠానం పెద్దల దృష్టికి తీసుకెళ్లినా తమకు మద్దతు లభించడం లేదని సమావేశంలో పాల్గొన్న నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సదరు నేత తీరు బాగోలేదని, తమకు పార్టీలో మనుగడ లేదని అభిప్రాయ పడినట్లు తెలుస్తున్నది. కొందరు అసమ్మతి నేతలు పార్టీ మారేందుకు సిద్దమని చెప్పారని వినికిడి. ముఖ్య కార్యకర్తల బూత్ అధ్యక్షుల అభిప్రాయ సేకరణలను పట్టించుకోకుండా కొంతమంది నిర్ణయాలతోనే నామినేటెడ్ సభ్యుడి వర్గానికి పార్టీ పదవులు కట్టబెడుతున్నారని బలంగా వాదించినట్లు సమాచారం.
అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కంటోన్మెంట్ సెగ్మెంట్లో ఓటింగ్ శాతం పెరిగినా కొందరు స్వార్థపూరిత నేతల వైఖరితోనే నియోజకవర్గంలో పార్టీ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నట్లు వినికిడి.బోర్డు నామినేటెడ్ సభ్యుడిని పదవిలో నుంచి తొలగించి, పార్టీనే నమ్ముకున్న వ్యక్తికి కట్టబెట్టాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ప్రధానంగా బోర్డు ఎన్నికలు లేకుండా నాలుగేండ్లుగా నామినేటెడ్ సభ్యుడిని ఒక్కరినే కొనసాగించడంతో పార్టీలోనే సీనియర్లుగా ఉన్న తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు.
గతంలో బానుకా మల్లికార్జున్, రామకృష్ణ ఇద్దరు నేతలు ఎంతో కలిసిమెలిసి ఉండేవారు. కానీ నామినేటెడ్ సభ్యుడు తన ప్రత్యర్థిని వెంటేసుకుని వార్డులో తిరుగుతూ పనులు ప్రారంభిస్తుండడంపై బీజేపీ నాయకుడు భానుకా మల్లిఖార్జున్ తీవ్రంగా అక్షేపిస్తున్నారు. దీంతో నామినేటెడ్ సభ్యుడితో తాడోపేడో తేల్చుకునేందుకు మల్లిఖార్జున్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆశీస్సులతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అన్ని వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులతోపాటు వర్క్ ఆర్డర్లను సిద్ధం చేయించే పనిలో భాగంగా వరుసగా బోర్డు సీఈఓ మధుకర్నాయక్తో సమావేశమవుతున్నారు. త్వరలోనే ఎంపీ ల్యాడ్స్ కింద రూ.5కోట్లతో కంటోన్మెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రామకృష్ణ సైతం ఆరో వార్డుకు చెందిన బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్తో కలిసి ఆ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇది బోర్డు అధికారులకు, బీజేపీ కార్యకర్తలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.