సిటీబ్యూరో: రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంపై ఆయుష్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఉదంతంపై కళాశాల ప్రిన్సిపాల్‌ను పిలిచి వివరణ కోరిన బోర్డు అధికారులు అంతర్గత విచారణను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ పరిధిలో ఉన్న అన్ని వైద్య కళాశాలల నుంచి ఫీజుల వివరాలను తెప్పించి పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
అయితే రామంతాపూర్ హోమియో కళాశాలలో ఎవరి ఆదేశాల మేరకు ఫీజులు పెంచారనే దానిపై అంతర్గత విచారణ మొదలు పెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో ఫీజులు పెంచడంపై ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభించిన ఆయుష్ బోర్డు.. పెంచిన ఫీజులతో కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనే దానిపై కూడా విచారణ జరిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజుల దుర్వినియోగంపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని ఆయష్ బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా, కళాశాలలో జరిపిన ఆడిట్లో కూడా అవకతవకలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్లు సమాచారం.
దీంతో గతంలో జరిగిన ఆడిట్ వ్యవహారాలను పునఃపరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే కళాశాలలో ప్రభుత్వ అనుమతి లేకుండా వసూలు చేస్తున్న అధిక ఫీజులపై అంతర్గత విచారణను ప్రారంభించామని ఆయుష్ బోర్డు అధికారులు వెల్లడించారు. వారం, పది రోజుల్లో విచారణ పూర్తవుతుందని, నివేదిక రాగానే ప్రభుత్వానికి సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని బోర్డు అధికారులు చెబుతున్నారు.