దుండిగల్, ఆగస్టు 2: ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన పుట్టి వినోద, వెంకటేశ్ దంపతులు. వీరి కుమారుడైన నిఖిల్ (16)ను దుండిగల్ గ్రామ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంలో నిర్వహిస్తున్న ‘ఎన్ఎస్ఆర్ ఇంపల్స్’ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ (ఐఐటీఎఫ్టీబీ) గ్రూప్‌లో చేర్పించారు.
గత నెల 4న కళాశాలలో ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు నిర్వహించాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించింది. దీంతో తనకు కొత్త బట్టలు కావాలని నిఖిల్ తన తల్లి దండ్రులకు ఫోన్ చేశాడు. గురువారం ఉదయం తండ్రి వెంకటేశ్ కొత్త డ్రెస్, నోటు పుస్తకాలు తీసుకొచ్చి.. నిఖిల్‌కు కళాశాల వద్ద అందజేసి తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే, డ్రెస్ బాగాలేదని, వేరే ప్యాంటు తీసుకురావాలని నిఖిల్ మళ్లీ తన తండ్రికి ఫోన్‌చేసి చెప్పగా.. కొడుకును మందలించాడు. కొత్త డ్రెస్ నచ్చకపోతే పాత డ్రెస్ వేసుకోమని తండ్రి చెప్పాడు. నిఖిల్‌తో పాటు అదే రూమ్‌లో ఉంటున్న మిత్రులంతా రాత్రి 11 గంటల వరకు మాట్లాడి.. నిద్రకు ఉపక్రమించారు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గదిలోని ఓ విద్యార్థి మూత్ర విసర్జన కోసం నిద్రలేవగా.. నిఖిల్ సీలింగ్ హుక్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఇదే విషయాన్ని కళాశాల నిర్వాహకులు తెలుపగా, వారు వెంటనే నిఖిల్‌ను చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు నిఖిల్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, విద్యార్థి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే శవాన్ని తరలించడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం కొత్త దుస్తుల కోసమే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఏమైనా ఉందా..! అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఆ కళాశాలలో చదువుతున్న 400 మంది విద్యార్థులకు సెలవు ప్రకటించి ఇండ్లకు పంపించారు.
దుండిగల్ విలేజ్‌లో ఇంటర్ మీడియట్ తరగతులు నిర్వహిస్తున్న ‘ఎన్ఎస్ఆర్ ఇంపల్స్’ కళాశాలకు ఇక్కడ ఎటువంటి అనుమతులు లేవని కళాశాల ప్రతినిధులు పేర్కొన్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్‌లో ఉన్న కళాశాల అనుమతులపైనే ఇక్కడ తరగతులు నిర్వహించడంతో విద్యార్థులకు వసతిగృహం ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా.. భవన నిర్మాణ అనుమతుల విషయంలోనూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సెల్లార్, ఎస్+8 అంతస్తుల్లో ఉన్న ఈ భవన నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. ఓ పక్క విద్యార్థులకు తరగతులు జరుగుతున్నా, మరో పక్క నిర్మాణ పనులు కూడా కొనసాగడం పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా, కళాశాల భవనం ముందు మరో సెల్లార్ పనులు కొనసాగుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.