Heart Attack | హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో విషాదం నెలకొంది. పరీక్ష రాస్తుండగా ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో కుప్పకూలాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ – స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ ప్రణవ్ రాయ్ సాయి (17) బాగ్అంబర్పేటలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. స్లిప్ టెస్ట్ ఉండటంతో శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రణవ్ రాయ్‌ని తండ్రి శ్రీనివాస్ కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. పరీక్ష రాసే సమయంలో ప్రణవ్‌కు అనుకోకుండా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన అధ్యాపకులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రణవ్ మరణించాడని వైద్యులు తెలిపారు.
ప్రణవ్ రాయ్ సాయికి చిన్నప్పటి నుంచి గుండె సంబంధిత సమస్య ఉందని తెలిసింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా శుక్రవారం కూడా రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలకు సెలవు ప్రకటించింది. అయినప్పటికీ సదరు కాలేజీ ఎగ్జామ్ పెట్టింది. పైగా ప్రణవ్ పరీక్ష రాసే హాల్ కింద ఫ్లోర్లో ఉన్నప్పటికీ.. పైన ఉందని చెప్పి పంపించారు. పై ఫ్లోర్‌కు వెళ్లిన తర్వాత ఎగ్జామ్ హాల్ కిందనే ఉందని మెట్లపై నుంచి పంపించేశారు. ఇలా కిందకి, పైకి తిప్పడంతో ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.