Hyderabad | వెంగళరావునగర్, ఫిబ్రవరి 26 : అంతర్ రాష్ట్ర గంజాయి గ్యాంగ్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. మధురానగర్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ కథనం ప్రకారం ఒడిశా రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా గంజాయి సరఫరాపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి వెంగళరావునగర్ నలంద కళాశాల సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుట్టుగా గంజాయిని విక్రయిస్తుండగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌కు చెందిన గంజాయి సరఫరాదారుడు, అంతర్ రాష్ట్ర నిందితుడు బాలా హంతల్(24), కూకట్‌పల్లికి చెందిన బుర్రా శ్రీనివాసులు అలియాస్ వాసు(24), కూకట్‌పల్లికి చెందిన పెడ్లర్ గోనుగుంట అభిషేక్ (21)లను అరెస్ట్ చేసి.. వారి నుంచి భారీగా 41 కిలోల గంజాయి, రూ.40 వేలు నగదు, ప్యాకింగ్ మెటీరియల్, డ్యూక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాలో ఇంకా మరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చట్ట విరుద్ధంగా జరిగే అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి కఠినంగా వ్యవహరిస్తామని మధురానగర్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.