‘పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం..’ అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా..బల్దియా అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు ఆక్రమణకు గురైనా.. స్థానికులు ఫిర్యాదులు చేసినా.. చర్యలు తీసుకోవడం లేదు. పైగా ప్రైవేటు వ్యక్తులు ఏకంగా పార్కు స్థలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిసినా.. అటు వైపు కన్నెత్తి చూడటం లేదు..పైగా పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులను కొందరి ఒత్తిడితో గుత్తేదారు వదిలేయగా, ఇదే అదునుగా కొందరు తూర్పు వైపున గేటును కూడా పక్కకు మార్చేయడం కొసమెరుపు.
జూబ్లీహిల్స్ రోడ్ నం. 9లోని సత్వ ఎన్‌క్లేవ్‌తో పాటు వెనకనున్న లహోటీ లే అవుట్‌ను కలుపుతూ సుమారు 2వేల గజాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ పార్కు ఉంది. గతంలో సత్వ ఎన్క్లేవ్ వైపు ఉన్న పార్కు స్థలంతో పాటు పక్కనున్న కొంత రెవెన్యూ స్థలాన్ని మొవ్వా రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఆక్రమించేందుకు షెడ్ల నిర్మాణం చేయడంతో పాటు బౌన్సర్లను నియమించుకుని తిష్ట వేశారు. దీంతో పార్కుతో పాటు పక్కనే ఉన్న రెవెన్యూ స్థలాన్ని కాపాడుకోవడానికి సత్వ ఎన్క్లేవ్, లహోటీ లే అవుట్‌కు చెందిన కాలనీవాసులు సుదీర్ఘ పోరాటం చేశారు.
పార్కు స్థలాన్ని ప్లాట్‌గా చూపిస్తూ..జీహెచ్ఎంసీ సర్కిల్-18 అధికారులు భవన నిర్మాణ అనుమతిని ఇవ్వగా, విజిలెన్స్ విచారణ అనంతరం అక్రమంగా అనుమతులు ఇచ్చారని తేలింది. ఫోర్జరీ పత్రాలతో పార్కు స్థలాన్ని కాజేసేందుకు యత్నించిన మొవ్వా రవీంద్రనాథ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై సీసీఎస్‌లో క్రిమినల్ కేసు నమోదు కావడంతో అరెస్టయ్యారు. అప్పటినుంచి సుమారు 2వేల గజాల స్థలంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడంతో పాటు సుందరీకరణ పనులు జరిగాయి.
ఇదిలా ఉండగా, రెండు నెలల కిందట లహోటీ లే అవుట్‌లోని పార్కుకు సంబంధించిన దక్షిణం వైపున ప్రహరీ గోడను ప్రైవేటు వ్యక్తులు కూల్చేయడంతో పాటు నిర్మాణ సామగ్రిని పార్కులో వేయడంతో పార్కు రూపురేఖలు మారిపోయాయి. పార్కును పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు ప్రధాన గేటును కూడా పక్కకు మార్చేసినట్లు స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు సత్వా ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులు చేయడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చేసిన ప్రహరీని పరిశీలించారు.
ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండా పార్కు ప్రహరీని ఆనుకొని భవనం నిర్మిస్తున్నట్లు గుర్తించడంతో పాటు పార్కులో నిర్మాణ సామగ్రిని వేసినట్లు తేల్చారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని, సుమారు 2వేల గజాల విస్తీర్ణంలోని పార్కు చుట్టూ తక్షణమే ప్రహరీని నిర్మించాలంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో రూ.12 లక్షల వ్యయంతో పార్కు చుట్టూ ప్రహరీ పనులు చేపట్టారు. గోడ నిర్మాణ పనులు రెండుమూడురోజులు మాత్రమే చేసిన గుత్తేదారు అయితే కొంతమంది వ్యక్తుల ఒత్తిడితో పనులు నిలిపివేశారు.
ఇదే అదునుగా..
దీన్ని అదునుగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు పార్కుకు తూర్పు వైపున గేటును పక్కకు మార్చేశారు. అంతటితో ఆగకుండా నిర్మాణంలో ఉన్న తమ భవనం ఆవరణలో ఏర్పాటు చేసుకోవాల్సిన ట్రాన్స్ఫార్మర్లను జీహెచ్ఎంసీ పార్కు ప్రహరీ ముందు పెట్టారు. సొంత స్థలంలో పెట్టాల్సిన ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వ స్థలంలో ఎలా పెడతారని స్థానికులు ప్రశ్నించినా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 80కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కును సొంత ఆస్తిలా వాడుకుంటున్నారని స్థానికులు ఫిర్యాదు చేయగా, రెండుసార్లు హైడ్రా అధికారులు పార్కును పరిశీలించి వెళ్లారని..
అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు తొలగించేలా టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడతామంటూ హైడ్రా అధికారులు స్థానికులకు భరోసా ఇచ్చారు. అయితే రెండువారాలు గడిచినా.. జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్టేట్ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయాలని కాలనీవాసులు భావిస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి రూ.80కోట్ల విలువైన జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.