సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్వాడ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని, తనిఖీలు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫ్లయింగ్ స్వాడ్, ఎస్ఎస్టీలకు ఎంసీసీ నోడల్ అధికారి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్‌తో కలిసి ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో నగదు, లికర్ అక్రమ తరలింపును నిరోధించడానికి తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్నారు. బంగారం, వెండి, ఇతర వస్తువులు సీజ్ చేసి.. సంబంధిత సమాచారాన్ని ప్రతి రోజు రిటర్నింగ్ అధికారి ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఫ్లయింగ్ స్వాడ్స్ తమ మొబైల్లో ఈఎస్ఎంఎస్ (ఎక్స్పెండిచర్, సీజర్, మేనేజ్మెంట్ సిస్టమ్) అప్లికేషన్ ద్వారా రోజు వారీగా ఎన్నికల సంబంధిత సీజ్ చేసిన వివరాలను పొందుపర్చాలన్నారు. ఈ సమాచారాన్ని ఎఫ్ఎస్టీ హెడ్ ద్వారా సంబంధిత నోడల్ అధికారి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చేరవేయబడుతుందని చెప్పారు.
ఫ్లయింగ్ స్వాడ్.. ఎన్నికలకు సంబంధం లేని నగదును, వస్తువులను వెంటనే పరిశీలించి విడుదల చేయాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. రూ.10 లక్షలకు పైబడి ఉన్న నగదును ఆధాయపన్ను శాఖకు సమర్పించాలని తెలిపారు. ఫ్లయింగ్ స్వాడ్స్ మూడు షిఫ్ట్‌ల్లో పనిచేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి 9 టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్వాడ్ వాహనంలో సీసీ టీవీ కెమెరా ఉండాలని, వాహనాలు తనిఖీ చేసే సమయంలో వీడియో తీయాలన్నారు. వాహనాల తనిఖీ సమయంలో ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పారు. మహిళలు ఉన్న పక్షంలో మహిళా పోలీస్ సిబ్బందితో తనిఖీ చేయించాలన్నారు.
తమకు అందిన ఫిర్యాదులు, బెదిరింపులు, అక్రమంగా తరలిస్తున్న లికర్, ఆయుధాలు, నగదు, రాజకీయ పార్టీలు, నాయకుల ఎన్నికల వ్యయ ఖర్చులు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ ఖర్చులపై నిఘా ఉంచాలని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్ శరత్చంద్ర తెలిపారు. పోలింగ్‌కు 72 గంటల ముందు ఎన్నికల ప్రచారాలను వీడియో గ్రఫీ చేయాలన్నారు. ఇవన్నీ ఎన్నికల ముఖ్య విధులని తెలిపారు. సి- విజిల్లో భాగంగా ఫ్లయింగ్ స్వాడ్స్ తమ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి.. తమ డ్యూటీ ముగిసిన తర్వాత లాగౌట్ కావాలన్నారు. ఈ యాప్ ద్వారా అధికారులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో.. స్పష్టంగా తెలుస్తుందన్నారు. సిటీజన్స్ ఫిర్యాదు చేసిన వెంటనే.. వంద నిమిషాల్లో ఆ సమస్యపై తిరిగి సమాచారాన్ని (రిైప్లె) పొందుపర్చాలని శరత్ చంద్ర సూచించారు.
ఫ్లయింగ్ స్వాడ్ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక షిఫ్ట్.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక షిఫ్ట్, రాత్రి 10 నుంచి ఉదయం 8గంటల వరకు ఒక షిఫ్ట్.. మొత్తం మూడు షిఫ్టులుగా 24 గంటల పాటు పనిచేస్తాయని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్వాడ్ టీమ్‌లో సీఏపీఎఫ్, ఆర్పీఎఫ్ టీమ్‌లు కూడా పనిచేస్తాయన్నారు. ప్రతి వెహికిల్‌ను చెక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల్లో ఎటువంటి ప్రచారం చేపట్టరాదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లౌడ్ స్పీకర్లు రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు నిషేధమని తెలిపారు. ఫ్లయింగ్ స్వాడ్ సీజ్ చేసిన నగదుకు సంబంధించి రికార్డు చేసిన వీడియోను పౌరులు అడిగితే.. రూ.300 చలాన్ చెల్లిస్తే ఇవ్వబడుతుందని తెలిపారు. తనిఖీల్లో భాగంగా ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టు వద్ద తనిఖీ చేయాలని తెలిపారు.