సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మందుల కోసం ఏఆర్టీ సెంటర్‌కు వచ్చే హెచ్ఐవీ రోగులను బలవంతంగా ఇతర ప్రాంతాల్లోని సెంటర్లకు సిఫారసు చేస్తున్న ఓ వైద్యుడి వ్యవహారం, మధ్యాహ్నం 2 తరువాత మందులు ఇవ్వకపోవడంపై ‘నమస్తే’లో ‘ఉస్మానియా సెంటర్‌కు రావొద్దు’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. కొన్ని రోజులుగా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీ-సాక్స్) ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఉద్యోగులపై సరైన పర్యవేక్షణ లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీతకు టీ-సాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ‘నమస్తే’ కథనంపై స్పందించిన సాక్స్ జాయింట్ డైరెక్టర్‌తో పాటు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా. రాకేశ్ సాహాయ్, ఏఆర్టీ సెంటర్ నోడల్ అధికారి డా. మురళీధర్ తదితరులు శుక్రవారం ఉస్మానియా ఏఆర్టీ సెంటర్‌ను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ రోగులకు ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అక్కడ జరుగుతున్న వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకునేందుకు సాక్స్ అధికార బృందం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.