సైదాబాద్, నబంబర్ 25: మలక్‌పేట బీ-బ్లాక్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయంలోని ఖాళీ క్వార్టర్స్, స్థలాలను సోమవారం రాష్ట్ర డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సౌత్ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ ముకుందారెడ్డి, ఆర్డీవో రామకృష్ణ్ల పరిశీలించారు. ఈ సందర్భంగా సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ ఖాళీ క్వార్టర్స్ విస్తీర్ణంతో పాటు ఐటీ టవర్‌కు కేటాయించిన స్థలం వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు.
గోషామహల్‌లోని ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్థలంలో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించి, ఉస్మానియా దవాఖాన భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్‌గా గుర్తించింది. దీంతో గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు అనువైన ప్రదేశం కోసం అధికారులు అన్వేషణ మొదలు పెట్టారు. అందులో భాగంగా మలక్‌పేట బి-బ్లాక్‌లోని క్వార్టర్స్‌కు తరలించాలనే ఉద్దేశంతో ఈ ప్రదేశాన్ని పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో అధికారులు విచ్చేసి ముంతాజ్ కాలేజ్ ఎదురుగా ఉన్న పరిసరాలను, క్వార్టర్స్, ఖాళీ స్థలాన్ని పరిశీలించి పలు అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో చర్చించారు. ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు 25 ఎకరాల స్థలం అవసరం కాగా, ఖాళీ స్థలంతోపాటు క్వార్టర్స్ స్వాధీనం చేసుకున్నప్పటికీ.. పది ఎకరాలకు కంటే ఎక్కువగా లేకపోవడంతో స్థల అన్వేషణపై ఆరా తీశారు. మండల పరిధిలో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారని సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ తెలిపారు.