Hyderabad | కొండాపూర్, ఫిబ్రవరి 15 : నాసిరకం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొండాపూర్‌లోని కొత్తగూడ ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్‌లో ఉడకని అన్నంతో పాటు బోనస్‌గా పురుగులు సైతం వస్తుండడంతో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతున్నారు.
ఈ విషయంపై తల్లిదండ్రులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, మిడ్ డే మీల్స్ అందజేయడంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఉడికి ఉడకని భోజనంలో పురుగులు సైతం వస్తుండడం ఏంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఇలాంటి భోజనం తింటున్న పలువురు విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మిడ్ డే మీల్స్ ఎంత బాగుండేదని, ప్రస్తుతం నిఘా కొరవడంతో చౌక సరుకులతో ఆహారాన్ని తయారు చేసే విద్యార్థులకు అందిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తగు చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించారు.