సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్కు చుట్టూ అనధికారిక లాలీపాప్ బోర్డుల ప్రచారంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకున్న ప్రకటన బోర్డులపై ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి దందా చేస్తున్న తీరును ఎండగడుతూ గురువారం నమస్తే తెలంగాణలో ‘జీహెచ్ఎంసీ ఖజానాకు టార్గెట్ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఒక్కో బోర్డు నుంచి నెలకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.60 లక్షల మేర పబ్లిక్ మనీని పక్కదారి పట్టిస్తుండడం, ప్రకటనల విభాగంలో కొందరి క్యాచ్ చేసుకున్న సదరు ఏజెన్సీ ‘ముఖ్య’ నేత సోదరుడి అండదండలతో జీహెచ్ఎంసీ ఖజానాకు గండికొడుతుండడంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అక్రమ ప్రకటనలపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని సంబంధిత అడ్వైర్డెజ్మెంట్ విభాగానికి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఐతే విచారణ పేరిట కాలయాపన చేస్తారా? అక్రమంగా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి జీహెచ్ఎంసీ సొంతంగా నడిపిస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.