శామీర్‌పేట, అక్టోబర్ 14: దైవ దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగి, ముగ్గురు మృతి చెందగా మరో నలుగురికి గాయాల పాలయ్యారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.., జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్డుకు చెందిన బైరి మారుతి(31)తో పాటు చింతల్ బాపూనగర్‌కు చెందిన ఈదులకంటి బాల్‌రాజ్ గౌడ్(43), కుత్బుల్లాపూర్ మండలానికి చెందిన శ్రీనివాస్, సూరజ్, సురేశ్, వరుణ్‌లు ఇన్నోవా వాహనంలో తిరుపతికి వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
ఔటర్ రింగ్‌రోడ్డు గుండా కీసర-శామీర్‌పేట రోడ్డులో వస్తున్నారు. అప్పటికే, అశోకా లేల్యాండ్ బడా దోస్త్ వాహనదారులు కొబ్బరి కాయల లోడుతో ప్రసాద్, మురళి సాయి, మహేశ్‌లు మేడ్చల్ వైపు వస్తున్నారు. ప్రమాదవశాత్తు ప్రసాద్ లారీ ఎడవైపు టైర్ పగిలిపోవడంతో ఓఆర్ఆర్పై పార్క్‌లైన్ వద్ద వాహనాలు నిలుపుకుని స్టెఫినీ వేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి నుంచి మేడ్చల్ వైపు వస్తున్న ఇన్నోవా వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండి అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ వాహనాన్ని ఓఆర్ఆర్ రెయిలింగ్‌కు తగిలించాడు.
అప్రమత్తమై ఎరుదుగా రోడ్డుపై పార్క్‌లైన్ వద్ద ఆగి ఉన్న లారీని తప్పించబోయిన క్రమంలో రోడ్డుపై లారీ టైర్ స్టెఫినీ మార్చుతున్న ప్రసాద్‌ను ఢీకొడుతూ కొబ్బరికాయల లోడ్‌తో ఉన్న లారీని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ బైరి మారుతి, వెనుక సీటులో కూర్చున్న బాల్‌రాజ్ గౌడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడగా, లారీ డ్రైవర్ అయిన ప్రసాద్‌కు తల, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలు తగిలాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో నలుగురికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న శామీర్‌పేట సీఐ నిరంజన్‌రెడ్డి ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని పంచనామా నిర్వహించారు.