సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 31 (నమస్తే తెలంగాణ): నగరంలో వీధిలైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారి అంధకారం రాజ్యమేలుతోందని.. మరోవైపు కనీసం ఫాగింగ్ చేసే దిక్కులేక దోమలు స్వైర విహారం చేస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దాసోజు శ్రవణ్, కాలేరు వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన హైదరాబాద్ జిల్లా సమీక్షా సమావేశంలో జరిగింది.
ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, నగర ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కూడా సమావేశానికి హాజరై నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. ప్రభుత్వ, అధికార యంత్రాంగం సరైన రీతిలో స్పందించికపోవడంతో జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు లక్ష్యంగా చేపట్టిన అద్భుత కార్యక్రమంలో భాగంగా వేలాది ఇండ్లను పంపిణీ చేశామని, కానీ ఈ ప్రభుత్వం సిద్ధమైన ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేయడంలేదన్నారు.
ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం మార్గదర్శకాల్లో ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతుందని, నగరంలో జాగాలు ఉన్న నిరుపేదలు అతి తక్కువ మంది ఉండటంతో పాటు చాలామందికి కొంత స్థలం ఉన్నా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉండటంలేదన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఎంపిక జాబితాను పరిశీలిస్తే బీసీ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. బస్తీ దవాఖాలన్నీ నిర్వీర్యమైపోవడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు.
నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశ లేదని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి ముఖ్యమైన మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకుని అభివృద్ధి కుంటుపడేలా చేస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ నగరాభివృద్ధి సమీక్ష సంబంధిత పురపాలక శాఖ మంత్రి లేకుండానే నిర్వహించడమంటే ప్రభుత్వానికి నగరాభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందునా హడావుడిగా ఉదయం ఎజెండా అంశా లు పంపించి.. సాయంత్రానికి సమీక్ష ముగించడంపై పలువురు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిగే ఈ సమీక్షపై కొన్నిరోజుల ముందే సమాచారం ఉంటే ప్రజాప్రతినిధులుగానీ, అధికార యంత్రాంగంగానీ సమస్యలపై లోతైన పరిశీలన చేసి పరిష్కారాలను సైతం ప్రభుత్వం ముందు ఉంచే అవకాశముంటుందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. సీఎం దగ్గరే పురపాలక శాఖ ఉన్నందున ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి సమీక్షల్ని నిర్వహిస్తే నిధుల కేటాయింపు, ఇతర క్లిష్టమైన సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం నిర్మించిన 62,500 పైగా ఉన్న రెండు పడకల గదుల ఇండ్లను ప్రభుత్వంతో చర్చించి జూన్ 15 వరకు పేదలకు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థలాలు ఉన్న పేదలకు అత్యంత ప్రాధాన్యతతో రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో 150 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేవనెత్తిన అనేక అంశాలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ అశోక్ రెడ్డి,హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.