ఇంతన్నాడు.. అంతన్నాడే.. అంతలోనే ముంచేశాడు సీఎం రేవంత్ రెడ్డి.. విశ్వనగరం వైపు వడివడిగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ నడ్డి విరిగినట్లుగా కాంగ్రెస్ పాలనలో బొక్కబోర్లా పడింది. దశాబ్దాల కాలంగా అభివృద్ధిలో దూసుకుపోగా, హైదరాబాద్ నగరమే పెట్టుబడుల ప్రధాన డెస్టినేషన్‌గా నిలిచింది. పరిశ్రమలు, నిర్మాణ రంగం, మౌలిక వసతుల ప్రాజెక్టులతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. కానీ విశ్వనగరానికి గ్రహణంలా పట్టిన కాంగ్రెస్ పాలన పెను శాపంలా మారింది. మినీ ఇండియాను తలపించే హైదరాబాద్ వరల్డ్ క్లాస్ బిజినెస్ హబ్‌గా పురోగమనంలో దూసుకుపోవాల్సిన మహానగరం ఇప్పుడు తిరోగమనంతో ప్రతిష్ట దిగజారిపోతున్నది. రేవంత్ సర్కారు ప్రణాళిక వైఫల్యంతో అభివృద్ధి స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు. అయితే ఇవేవో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కసుతో చెబుతున్న మాటలు అనుకుంటే పొరపాటే.. సర్కారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నగర అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి.
సిటీబ్యూరో, సెప్టెంబరు 1 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సిటీగా పరుగులు పెట్టాల్సిన మహానగరం ఇతర మెట్రో నగరాలతో వెనుకబడిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాభివృద్ధి శాఖలో ఇటీవల జరిగిన ఎన్నో మార్పులు చేర్పులు, సంస్కరణల పేరిట మారిన ప్రాజెక్టుల అలైన్మెంట్లు, పాలనపరమైన అడ్డగోలు విధివిధానాలే ఉదాహరణలు అవుతున్నాయి. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ, మెట్రోతోపాటు, జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి, మౌలిక వసతులు లేక కొట్టుమిట్టాడుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా ప్రాజెక్టుకు టెండర్ పిలిస్తే చాలు…ఆ పనులను దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో ఏజెన్సీలు పోటీ పడేవి..ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారంగా తీసుకువచ్చిన ఎస్ఆర్డీపీ పనులకు చిన్న కాంట్రాక్టర్ల నుంచి బడా కాంట్రాక్టర్లు సైతం టెండర్ ప్రక్రియలో పాల్గొని పనులు దక్కించుకునేవారు..ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీ, ఆర్యూబీ పనుల్లో భాగంగా అప్పటి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రాజెక్టులను నిర్ణీత గడువు ముందే పూర్తి చేశారు..కానీ ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఒక్క ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు. ఎస్ఆర్డీపీని హెచ్ సిటీ ప్రాజెక్టుగా పేరు మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా ప్రకటించారు.
అంతేకాదు పాలన ఏడాది తొలి డిసెంబర్ నెలలో కేబీఆర్ పార్కు చుట్టూ రూ. 1070కోట్ల పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు పట్టుమని పది శాతం పనులు కూడా పూర్తి కాకపోవడం సర్కారు పనితీరుకు నిదర్శనం..ఈ నేపథ్యంలోనే హెచ్సిటీ ప్రాజెక్టు కింద రూ. 7032 కోట్లతో 38 చోట్ల ఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులకుగానూ విడుతల వారీగా టెండర్లు పిలుస్తున్న పనులు దక్కించుకునేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదు..జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు జీతాల్లేక అవస్థలు పడుతుండడం, దాదాపు రూ.6500కోట్ల మేర అప్పుల ఊబిలో కూరుకుపోవడం, ప్రాజెక్టు ఇంజినీరింగ్ విభాగం అస్తవ్యస్తంగా మారడం, ప్రాజెక్టు పనులపై ప్రణాళికలు లోపించడం, ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలు వెరసి కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ పనులపై ఆసక్తికనబర్చడం లేదు..
ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం..
హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 38 చోట్ల పనుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇందుకు రూ. 7032 కోట్లు ఖర్చు చేయనున్నారు. 28 ఫ్లై ఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్వోబీలు, మూడు చోట్ల ఆర్‌యూబీలు, పది చోట్ల రహదారుల విస్తరణ పనులకు గానూ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాల్సి ఉండగా..నేటికీ చాలా చోట్ల టెండర్ దశలోనే ఉన్నాయి. 13 చోట్ల పనులకు టెండర్లు పిలవగా, వివిధ దశల్లో ఉన్నాయి. మరో 15 చోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సన్నద్దమవుతున్నారు. కాగా 30 చోట్ల పనులకు మాత్రం ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. కాగా రూ. 780కోట్ల నిదులు ప్రభుత్వం ఇస్తే కానీ భూ సేకరణ ముందడుగు పడని పరిస్థితి నెలకొంది.
కాగా బీఆర్ఎస్ హయాంలో తుది దశకు చేరుకున్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను తీరిగ్గా రెండేళ్ల తర్వాత పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..బైరామల్‌గూడ, జూపార్కు, చాంద్రాయణగుట్ట, ముసారాంబాగ్ బ్రిడ్జిలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం గమనార్హం. హైదరాబాద్ నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం…బడ్జెట్లో రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం…రూ. 7032 కోట్లతో హెచ్ సిటీ ప్రాజెక్టు ద్వారా 58 ప్రాజెక్టులు చేపడుతున్నాం …బడ్జెట్ కేటాయింపుల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన గొప్ప ప్రకటనలు..కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ప్రాజెక్టు పనులు పట్టాలెక్కలేదు…ఐతే అధికారుల నిర్లక్ష్యంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జఠిలమవుతున్నది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావని సోషల్ మీడియా వేదికగా వాహనదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, కోఠి మార్గాల్లో ట్రాఫిక్ సుడిగుండం నుంచి బయట పడాలంటే నరకయాతన తప్పడం లేదని వాహనదారులు చెబుతున్నారు.
మెట్రోకు దిక్కు లేదు.. మూసీ మురిసింది లేదు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ హయాంలో చేపట్టి, తుది దశలో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేసి ప్రారంభించింది. కానీ సొంతంగా కాంగ్రెస్ రూపొందించిన ప్రణాళికలకు రూపం లేదు. హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేసి వదిలిపెట్టారు. 16 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు కోసం కనీసం భూసేకరణ ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. అదే విధంగా హెచ్ఎండీఏ పరిధిలో పలు ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయి. వీటిని ఆలైన్మెంట్ మార్చివేసి, కొత్తగా చేపట్టాలని భావించిన అరకొర నిధులతో ఇప్పటికీ మొదలుకాలేదు. ఇక హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త నగరాన్ని తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ తీసుకువచ్చిన 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఫ్యూచర్ సిటీ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.
కాగితాల్లో కనిపిస్తూ, జనసంచారమే లేని ఊహనగరానికి మెట్రో పరుగులు పెట్టిస్తామని చెప్పి… కోర్ సిటీలో మెట్రో ప్రతిపాదనలను అటకెక్కించింది. అలా నగరంలో రూ. 24వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫేజ్-2 మెట్రో విస్తరణలో నార్త్ సిటీకి చోటు కల్పించకుండానే ఫ్యూచర్ సిటీకి మెట్రో వస్తుందంటూ హడావుడి చేసింది. అదే విధంగా అధికారంలోకి రావడంతోనే హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్ సిటీలా, జపాన్ పర్యటనలో టోక్యో నగరంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తామంటూ ప్రకటించిన ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కనీసం ఏడాదిన్నర పాలనలో మాస్టర్ ప్లాన్ ముసాయిదాను కూడా విడుదల చేయలేకపోయింది.
ఇలా హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపాదించిన ప్రణాళికలన్నీ దిక్కుదివానా లేకుండా కాగితాల్లోనూ కనువిందు చేస్తున్నాయి. చివరకు మెట్రో స్వాధీనం పేరిట హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీ రూ. 13,500 కోట్ల రుణాలను పొందలేక చేతులెత్తివేసింది. ఇక లక్షన్నర కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని, కాంగ్రెస్ బ్రెయిన్ చైల్డ్‌గా చెప్పుకునే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన నిధులకు రెండేళ్లు గడుస్తున్నా చిల్లి గవ్వ కూడా తీసుకురాలేదు. కానీ సర్వేలు, అధ్యయనాలు, నివేదికల పేరిట ఇప్పటివరకు వందల కోట్ల రూపాయలను మూసీ మురుగులో కలిపిందనే విమర్శలు ఉన్నాయి.