హిమాయత్ నగర్, మే 7: వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, ఊరికి వెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఇంటి వద్ద ప్రత్యేక నిఘా పెట్టేందుకు హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తూ.. సరికొత్త పంథాల్లో నిఘాను పటిష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను మాత్రమే ఎంచుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని.. వారిపట్ల అప్రమత్తంగా ఉంటూ విధిగా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. అందుకే విహారయాత్రలకు, ఊరికి వెళ్లేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్లే సమయంలో పక్కింటి వారితో పాటు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు విహారయాత్రలు, ఊరికి వెళ్లే సమయంలో సమాచారం ఇస్తే గస్తీ పెంచుతామని నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు. అపార్ట్మెంట్లకు సెక్యూరిటీగా ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో అపార్ట్మెంట్లలోకి వచ్చే అనుమానిత వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర సమయంలో 100 లేదా 87126 60120 నంబర్లకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. హాక్ఐ, ఫేస్బుక్, వాట్సాప్ ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని, నేరాలను అదుపు చేయడానికి పోలీసులకు సహకరించాలని కోరారు.