హైదరాబాద్లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖైరతాబాద్-లక్డీకపూల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై 15 రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. అయితే ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రైల్వే సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పసికందును చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆడపిల్ల పుట్టిందనే కారణంతోనే వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.