Hyderabad | మాదాపూర్, మార్చి 22: గుర్తుతెలియని నవజాత శిశువు మృతదేహం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం లభ్యమైనది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన కథనం ప్రకారం… మెడికవర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి బస్ స్టాప్ ముందర డ్రైనేజీ వద్ద శిశువు మృతదేహం వర్షానికి కొట్టుకొని రావడంతో మెడికవర్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నమాజ్ కోసం వెళ్తుండగా నవజాత శిశువును గుర్తించి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్‌కు విషయాన్ని తెలియజేశాడు.
డ్యూటీ డాక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని నవజాత మగ శిశువు మృతదేహాన్ని పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో మాదాపూర్ పోలీస్ లకు సమాచారం అందించగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా రాత్రి పడిన వర్షానికి కొట్టుకు వచ్చి బస్ స్టాప్ ముందర ఉన్న డ్రైనేజీ వద్ద చెత్తతో పాటు ఆగినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ మార్చురీకి తరలించి కేసును నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.