స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఫలితంగా జిల్లా ఉపాధి హబ్‌గా అవతరించింది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా విస్తరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టీఎస్ఐపాస్’ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను స్పష్టిస్తున్నది. కేవలం 9 ఏండ్లలో రంగారెడ్డి జిల్లాలో 47,062.19 కోట్ల పెట్టుబడులతో 1252 పరిశ్రమలు ఏర్పాటవ్వగా, ఏకంగా 5,15,851 మందికి ఉపాధి లభించింది. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రానుండటంతో యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రంగారెడ్డి జిల్లాలో కేవలం 3వేల 328 కోట్ల పెట్టుబడులతో 2,777 పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అప్పట్లో కేవలం 45,763 మందికి మాత్రమే ఉపాధి కల్పించబడింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం జిల్లాలో 47 వేల 62 కోట్ల పెట్టుబడులతో 1,252 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 5,15,851 మందికి ఉపాధి పొందుతున్నారు. ప్రముఖ సంస్థలైన ఫాక్స్ కాన్, గూగుల్, బోయింగ్, విప్రో, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంట్, ఓరియంట్, ఆస్ట్రల్ వంటి పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
మారుమూల ప్రాంతమైన చందన్వెల్లి నేడు పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులో ఐదేండ్లలోనే రూ.13,508కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఏర్పాటై 3,210 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. వెల్స్పన్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్, దైఫుకు, నికోమాక్ తైకిషా, కిటెక్స్ వంటి మెగా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే కొలువుదీరాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండగల్ వద్ద రూ.650కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఉత్పత్తులను సైతం మొదలుపెట్టడం విశేషం.
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 16 ఇండస్ట్రియల్ పార్కులు ఉండగా..మరో మూడు పార్క్‌లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రావిర్యాల(ఈ-సిటీ), మహేశ్వరంలోని రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ క్లస్టర్, ముచ్చర్ల ఫార్మాసిటీ, చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటయ్యాయి. 19,333 ఎకరాల్లో రూ.63వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మాసిటీ ద్వారానే లక్ష మందికి పైగా ఉపాధి లభించనున్నది. సరుకు రవాణా సౌకర్యం కోసం బాట సింగారం, మంగళ్‌పల్లి వద్ద కొత్తగా లాజిస్టిక్ పార్కులు ఏర్పాటయ్యాయి.
అయితే జిల్లాలో కొత్తగా మరో 19 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు సైతం పంపించింది. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే దశలవారీగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం వంటివి టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ పార్కుల ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఉపాధి హబ్‌గా మారింది. దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామమైంది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేకుండా విస్తరిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘టీఎస్ఐపాస్’ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అద్భుతాలను స్పష్టిస్తున్నది. నలు దిశలా ఏర్పాటవుతున్న పరిశ్రమలతో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం 9 ఏండ్లలో రంగారెడ్డి జిల్లాలో 47,062.19 కోట్ల పెట్టుబడులతో 1252 పరిశ్రమలు ఏర్పాటవ్వగా, ఏకంగా 5,15,851 మందికి ఉపాధి లభించింది. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రానుండటంతో యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తొమ్మిదేండ్ల కాలంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు 1,252 ఏర్పాటవ్వగా.. వీటితో ప్రత్యక్షంగా 5,15,851 మంది ఉపాధి పొందుతున్నారు. ఉపాధి అవకాశాల్లో పారిశ్రామికవేత్తలు స్థానికులకే ప్రాధాన్యత ఇస్తుండగా..ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు సైతం ఉపాధి పొందుతున్నారు.