మేడ్చల్, ఆగస్టు29(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి టీఎస్ఐఐసీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది. రైతుల నుంచి సేకరించిన భూమికి రూ. 180 కోట్లు చెల్లించిన విషయం విధితమే. అయితే ఇప్పటి వరకు మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ పనులు నామ మాత్రంగా ప్రారంభించారు. టీఎస్ఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్‌కు సంబంధించి లే అవుట్‌ను సిద్ధం చేసి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకున్న వారికి మాదారం పార్క్‌లో కొన్ని ప్లాట్లను టీఎస్ఐఐసీ విక్రయించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు పార్క్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రం అనుకూలంగా తీర్చిదిద్దలేదు. ఉన్న భూమిని మాత్రం చదును చేసి పనులు చేస్తున్నట్లు టీఎస్ఐఐసీ నమ్మబలికేలా చూస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్క్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పార్క్‌లో 255 పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా లే అవుట్‌ను చేశారు. రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని మాత్రమే చదును చేసి వదిలేశారు. పార్క్ పూర్తయితే సుమారు 255 వివిధ పరిశ్రమలు ఏర్పడి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే టీఎస్ఐఐసీ పనులను చేపట్టడంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శలను ఎదుర్కోంటుంది. పార్క్‌కు సంబంధించి బిల్లులు చెల్లించకపోవడం వల్లే పనులు సాగడం లేదని తెలుస్తోంది. ఇలా అయితే ఎప్పుడు పనులు పూర్తవుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో మరిన్ని ఇండస్ట్రీయల్ పార్క్‌లు ఏర్పాటు చేసేలా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటుకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అనుకూలంగా ఉన్న క్రమంలో పార్క్‌లను ఏర్పాటు చేసి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మాదారం సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైతే పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా చర్యలు తీసుకుంది. జిల్లా చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకోని ఉండటంతో ఇతర ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు రైతులను నుంచి భూమిని సేకరించారు. పార్క్ పూర్తయితే వివిధ పరిశ్రమలు ఏర్పడి ఈ ప్రాంతమంతా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. పరిశ్రమలన్ని గ్రీన్హ్రిత పరిశ్రమలే ఏర్పాటు కానున్నాయి.