ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 27: ప్రతి ఒక్క రంగంలో వేగంగా పరిణామం చెందుతున్న సరికొత్త ప్రపంచ నిర్మాణంలో భారత్ ప్రతిభావంతమైన పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అధ్యక్షుడు డాక్టర్ వినయ్ పి. సహస్రబుద్ధి అన్నారు. తార్నాకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఆడిటోరియంలో ‘వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకడమీషియన్స్’పై ఒక రోజు సదస్సును బుధవారం నిర్వహించారు. అసోసియేషన్ ఫర్ ప్రమోటింగ్ ఇండిక్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ సహకారంతో అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎస్ఎం) ఈ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో డాక్టర్ వినయ్ సహస్రబుద్ధి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త ప్రపంచ పరిణామక్రమానికి నాయకత్వం వహించి, భారత్ విశ్వగురువుగా ఆవిర్భవించే తరుణం ఆసన్నమైందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలను చక్కగా అధ్యయనం చేసి, దేశ ప్రయోజనాలకు సముచితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్మోహన్రావు మాట్లాడుతూ.. దేశానికి ఉపయోగపడే విధానపరమైన సవ్యదిశలను రూపొందించడంలో ఇలాంటి సమావేశాలు లాభం చేకూరుస్తాయని అన్నారు. తద్వారా ప్రపంచ వేదికపై భారత్ ఎంతో మెరుగైన నిర్మాణాత్మకమైన భూమిక పోషిస్తుందని విశ్వాసం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ ఆచార్య బీజే రావు, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఇ. సురేశ్‌కుమార్, ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత, ఏబీఆర్ఎస్ఎం ఆలిండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంతా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.