సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వేరియంట్ వల్ల పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణలు, వృద్ధులు జాగ్రతగా ఉండాలన్నారు.
కేరళ, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండడం, థానే ప్రాంతంలో ఓ యువకుడు, బెంగళూరులో 84 ఏండ్ల వృద్ధుడు మరణించడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. విదేశీ ప్రయాణాలతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ జరిగిన వారు జనావాసాల మధ్య తిరగకుండా స్వీయ ఐసొలేషన్లో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని గ్రేటర్ వైద్యదాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.