మాదాపూర్, డిసెంబర్ 13 : భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదని, భారత ప్రభుత్వం రైతులకు చేయూతనందించేందుకు అనేక పథకాలతో పాటు మొక్కల ఆరోగ్యం, మానవ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నదని ఎన్ఐపీహెచ్ఎం (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్), వ్యవసాయం, రైతు వెల్ఫేర్ విభాగం డీజీ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం నిర్వహించిన బయో అగ్రి 2023 ఎక్స్ పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ హాజరై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే మల్హోత్రా, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీన్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అనేక మంది రైతులు తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపోయే ఆహారాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గత 70 ఏండ్లుగా రసాయన ఎరువులను వేసి మట్టిని కలుషితం చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యకరమైన నేలను తిరిగిపొందడానికి ఎన్ఐపీహెచ్ఎం వద్ద రైతులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 58శాతం మంది నేరుగా వ్యవసాయం, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నారని, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం 2020 నాటికి 2.78 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూములు సేంద్రియ సాగులో ఉన్నట్లు పేర్కొన్నారు. మన దేశంలో ఉన్నటువంటి వాతావరణం కారణంగా స్మార్ట్ వ్యవసాయంలో జీ-20 సదస్సులో ఇతర దేశాలతో పోల్చితే అబ్జర్వర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపిందని డాక్టర్ ఎస్కే మల్హోత్రా అన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 25 పైగా కంపెనీలు స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 300పైగా పలు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.