Body Shaming | సిటీబ్యూరో, జూన్ 10(నమస్తే తెలంగాణ):హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలకు పెళ్లయి నాలుగేళ్లు. ఇద్దరు పిల్లలు. సాఫీగా సాగిన కాపురంలో భర్త ఈసడింపులు పెరిగాయి. భార్యను లావుకు తగ్గట్టుగా సంసారాన్ని నడపాలంటూ, రెండు ఉద్యోగాలు చేయాలంటూ సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టాడు. కొన్నిరోజులకు రెండు కుటుంబాల ఫంక్షన్లలో కూడా ఇవే కామెంట్స్ చేశారు. ఇదేంటని అడిగితే చేయిచేసుకుని లావెక్కావంటూ హేళన చేశాడు. దీంతో మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధితురాలు తన భర్త వ్యవహారాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు.
ముషీరాబాద్‌కు చెందిన ఒక నవ వధువు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నప్పుడు గుండె ఆపరేషన్ జరిగిన విషయం దాచిపెట్టారంటూ భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి తల్లిదండ్రులు తమ కూతురు విషయంలో హాస్పిటల్ రిపోర్ట్లు చూపించినా భర్త వినకపోగా ఆమె తల్లిదండ్రులను అవమానించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తనకు అనారోగ్యం లేకున్నా ఉన్నదంటూ హేళన చేయడమే కాకుండా తన తల్లిదండ్రులను అవమానించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు చెప్పారు.
నగరానికి చెందిన ఓ యువకుడు వైద్యవృత్తిలో స్థిరపడ్డాడు. కొంచెం లేటయినా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌తో వివాహం సెటిలయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్నిరోజులకు ఆ యువతి వివాహం వద్దంటూ క్యాన్సిల్ చేసింది. కారణం అబ్బాయికి బట్టతల ఉందంటూ చెప్పడమేనని తెలిసింది. దీంతో ఆ వ్యక్తి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు.
నగరానికి చెందిన యువకుడికి సూర్యాపేట యువతితో వివాహమైంది. ఆ యువతికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశతో పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కాపురం చేసిన తర్వాత ఆమెకు ఉద్యోగం రాకపోవడంతో హేళన చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో ఉద్యోగం రాలేదని, ఆ తర్వాత నల్లగా ఉన్నావంటూ చెప్పి కాపురం చేయలేనంటూ పుట్టింటికి పంపాడు. అప్పుడు నాజూగ్గా కనిపించిన భార్య ఇప్పుడు నల్లగా కనిపించిందంటే ఉద్యోగం కారణమా.. ఇంకేమైనా ఉందా అంటూ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ చేశారు. అయినా అతను ఒప్పుకోకపోవడంతో కోర్టుకెళ్లారు.
హైదరాబాద్ నగరంలోని మహిళా పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నగరంలోని ఏడు మహిళా పోలీస్స్టేషన్లలోని ఒక్కో స్టేషన్లో వారంలో వచ్చే కనీసం పది కేసుల్లో ఇలాంటివి రెండు నుంచి మూడు కేసులు ఉంటున్నాయని పోలీసులు చెప్పారు. గతంలో ఇటువంటివి లేవని, ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోయాయని వారు పేర్కొన్నారు. సంతోషంగా సాగాల్సిన కాపురాల్లో బాడీషేమింగ్ చిచ్చు పెడుతోంది. ఒకరిని ఒకరు నిం దించుకుంటూ చేజేతులా సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారని పోలీసులు చెప్పారు.
ముఖ్యంగా నల్లగా ఉన్నావని, లావెక్కుతున్నావని, పెళ్లి సమయంలో ఉన్నట్లుగా లేవంటూ భార్యాభర్తల మధ్య సూటిపోటి మాటలు పెరిగి విడాకుల వరకు వెళ్తున్నారు. పెళ్లి పీటలపై నాజూగ్గా కనిపించిన యువతి పిల్లలు పుట్టాక లావెక్కిందని బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో , పార్టీలకు వెళ్లాలంటే నామోషీగా ఉంటుందన్న కారణంతో ఓ ప్రబుద్ధుడు విడాకులు ఇవ్వడానికి తయారయ్యాడని, అతనికి ఎంత కౌన్సెలింగ్ ఇచ్చినా ఒప్పుకోవడం లేదని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఉన్న కౌన్సెలర్లు చెప్పారు. భార్యాభర్తల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే లక్ష్యంతో తప్పటడుగులు వేస్తున్నారని, పరస్పరం మానసిక, శారీరక లోపాలను ఎత్తిచూపుతూ కలహాల కాపురం కొనసాగిస్తున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
నవ దంపతుల్లో మరీ ఎక్కువ..!
కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతుల్లో ఈ సమస్యలు మరీ అధికంగా ఉంటున్నాయని మహిళా పీఎస్ అధికారి ఒకరు చెప్పారు. పెళ్లయిన ఆరు నెలల్లోపే మహిళా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని ఆమె తెలిపారు. ప్రధానంగా ఇద్దరు ఉద్యోగులు ఉన్న దగ్గర పళ్లున నాలుగైదు నెలలు బాగానే ఉన్నప్పటికీ తర్వాత ఏదో ఒక సాకుతో బాడీషేమింగ్ చేసుకుంటున్నారని, ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలతో పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు చేసుకోవలసిన పరిస్థితి వస్తున్నదని ఆ మహిళా అధికారి పేర్కొన్నారు. కోటిఆశలతో కొత్త సంసారంలోకి వచ్చినవారు ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం అనుభవించడం లేదని ఇటీవల స్టేషన్లకు వస్తున్న కేసులే నిదర్శనమని ఆమె చెప్పారు.
ఇద్దరూ విద్యావంతులు, ఉద్యోగస్తులే కావడం తో ఎవరికి వారే స్వతంత్రంగా బతుకుతామన్న ధీమాతో గొడవలు పడుతున్నారని, సర్దుకుపోలేక, సర్దిచెప్పేవాళ్లు లేక పోలీస్ కౌన్సెలింగ్ అయిన తర్వాత కూడా మళ్లీ స్టేషన్‌వరకు పంచాయితీలు పెట్టుకుని వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో దంపతులకు పెళ్లి ప్రాధాన్యత తెలిపే ప్రయత్నం చేయాలని, ఒకరిపై ఒకరు ఆధిపత్యపోరు, ఇగో సమస్యలతో ఇబ్బందిపడకుండా పెద్దలు చూడాలని ఆ పోలీస్ అధికారి చెప్పారు.